కెఫే నిలోఫర్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌

22 Jul, 2021 03:56 IST|Sakshi

శంషాబాద్‌ వద్ద రూ.30 కోట్లతో ఏర్పాటు

హిమాయత్‌నగర్‌లో ప్రీమియం లాంజ్‌

సాక్షితో సంస్థ వ్యవస్థాపకులు అనుముల బాబురావు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిలోఫర్‌ చాయ్‌.. బహుశా ఈ పేరు తెలియని హైదరాబాదీయులు ఉండరేమో. భాగ్యనగర వాసులే కాదు విదేశీయులు సైతం ఇక్కడి గరమ్‌ గరమ్‌ చాయ్‌ రుచి చూసినవారే. నాలుగు దశాబ్దాల నిలోఫర్‌ ప్రస్థానంలో ఇప్పటికే కోటి మందికిపైగా వినియోగదార్ల మనసు చూరగొంది. రెండవ తరం రాకతో సంస్థ విస్తరణ బాట పట్టింది. బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తుల తయారీతో మొదలుకుని ప్రీమియం లాంజ్‌ల ఏర్పాటు, టీ పొడుల విక్రయంలోకి రంగ ప్రవేశం చేసింది.  ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ సైతం నెలకొల్పుతున్నట్టు కెఫే నిలోఫర్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్న  ఏబీఆర్‌ కెఫే అండ్‌ బేకర్స్‌ వ్యవస్థాపకులు అనుముల బాబురావు వెల్లడించారు. సాక్షి బిజినెస్‌ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..

అత్యాధునిక యంత్రాలతో..
తయారీ కేంద్రం కోసం శంషాబాద్‌ దగ్గరలో తెలంగాణ ప్రభుత్వం ఆరు ఎకరాలను కేటాయించింది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ఈ అత్యాధునిక ప్లాంటుకు రూ.30 కోట్లు పెట్టుబడి చేస్తున్నాం. ఇక్కడ టీ పొడుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏడాదిలో, డ్రై కేక్స్, బిస్కట్స్‌ తయారీ కోసం బేకరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ æ2023లో అందుబాటులోకి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభిస్తుంది.

ఈ ఏడాదే నాల్గవ కేంద్రం..
హిమాయత్‌నగర్‌లో ప్రీమియం లాంజ్‌ను డిసెంబరులో ప్రారంభించనున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రానుంది. ఒకేసారి 250 మంది వినియోగదార్లకు సేవలు అందించే వీలుంది. ఈ సెంటర్‌కు 150 మందిని నియమిస్తాం. బంజారాహిల్స్‌లో ఉన్న ప్రీమియం లాంజ్‌ 2019లో ప్రారంభమైంది. లక్డీకాపూల్‌లో తొలి కెఫేకు సమీపంలోనే రెండవ కేంద్రాన్ని 2016లో ఏర్పాటు చేశాం.  మా కెఫేలకు రోజుకు 20,000 మంది కస్టమర్లు వస్తుంటారు.  

రెండేళ్లలో తెలంగాణలో..
టీ పొడులను మూడు రకాల రుచుల్లో పరిచయం చేశాం. రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ఇవి లభిస్తాయి. రూ.10 మొదలుకుని రూ.650ల ప్యాక్‌ వరకు తీసుకొచ్చాం. సంస్థ ఆదాయంలో ఆన్‌లైన్‌ వాటా 20 శాతం ఉంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే చాయ్‌ సైతం ప్రత్యేక బాక్స్‌ ద్వారా హైదరాబాద్‌లో డెలివరీ చేస్తున్నాం. 300ల రకాల బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. సంస్థలో 250 మంది ఉద్యోగులున్నారు.
 

మరిన్ని వార్తలు