రూటు మార్చిన ఎలన్‌ మస్క్‌.. ఇండియా మార్కెట్‌ కోసం సరికొత్త వ్యూహం

2 Nov, 2021 04:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియాలో తన వ్యాపార విస్తరణకు సంబంధించి ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్‌ సరికొత్త వ్యూహం ఎంచుకున్నారు. ఇప్పటి వరకు టెస్లా కార్ల అమ్మకాల ద్వారా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. అయితే ఈ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. దీంతో వ్యూహం మార్చి ఇంటర్నెట్‌ సేవలను తెర మీదకు తెచ్చారు.
బ్రాడ్‌బ్యాండ్‌
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ తాజాగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు వేగవంతం చేసింది. స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు భారత్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌సీపీఎల్‌) పేరిట దీన్ని నెలకొల్పినట్లు స్టార్‌లింక్‌ కంట్రీ డైరెక్టర్‌ (ఇండియా) సంజయ్‌ భార్గవ తెలిపారు. ఇక తాము లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు, బ్యాంక్‌ ఖాతాలు తెరవనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పర్మిషన్ల పనిలో
ప్రభుత్వ అనుమతులకు లోబడి 2 లక్షల యాక్టివ్‌ టెర్మినల్స్‌తో డిసెంబర్‌ 2022 నుంచి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే భారత్‌ నుంచి 5,000 ప్రీ–ఆర్డర్లు వచ్చాయని కంపెనీ చెబుతోంది. ఒకో కస్టమర్‌ నుంచి 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్‌ వసూలు చేస్తోంది. సెకనుకు 50–150 మెగాబిట్స్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందిస్తామని చెబుతోంది. దేశీయంగా రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాతో పాటు భారతి గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో స్టార్‌లింక్‌ పోటీపడాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను విస్తరించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోంది.

మరిన్ని వార్తలు