డిసెంబర్‌ క్వార్టర్‌లో మాంద్యంలోకి యూరప్‌ దేశాలు

19 Nov, 2022 05:57 IST|Sakshi

యూరోపియన్‌ కమిషన్‌ అంచనా

ఫ్రాంక్‌ఫర్ట్‌: ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్‌ త్రైమాసికంలో యూరోపియన్‌ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్‌ కమిషన్‌ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్‌ కమిషన్‌ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్‌లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు