35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్‌ సంగతేంది?

28 Sep, 2021 14:32 IST|Sakshi

ఏమాత్రం కనికరం లేకుండా భారీ జరిమానా విధించిన యూరోపియన్‌ యూనియన్‌ నియంత్రణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది గూగుల్‌. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా గూగుల్‌ అవకతవకలకు పాల్పడిందంటూ 2018లో ఈయూ యాంటీట్రస్ట్‌ రెగ్యులేటర్‌,  5 బిలియన్ల డాలర్ల( సుమారు 35 వేల కోట్లకుపైగా) జరిమానా విధించింది. అయితే మూడేళ్ల తర్వాత ఈ నష్టపరిహారంపై దాఖలైన పిటిషన్‌పై వాదప్రతివాదనలు సోమవారం యూరోపియన్‌ యూనియన్‌ ఉన్నత న్యాయస్థానంలో మొదలయ్యాయి.  
  


మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ విచారణ.. ఐదురోజులపాటు జరగనుంది.  అయితే ఈ ఆరోపణలపై గూగుల్‌ గట్టిగానే ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ మార్కెట్‌తో పాటు యాపిల్‌ మార్కెట్‌ కూడా నడుస్తోందని, అలాంటప్పుడు దానిని ఎలా విస్మరిస్తున్నారని గూగుల్‌, ఈయూ కమిషన్‌ను ఎదురుప్రశ్నించినట్లు సమాచారం. 

2011 నుంచి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ మార్కెటింగ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ విపరీతమైన లాభాలు వెనకేసుందని, ఈ క్రమంలో యూజర్ల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిందన‍్న ఆరోపణలపై ది యూరోపియన్‌ కమిషన్‌ గూగుల్‌కు 2018లో భారీ జరిమానా విధించింది.  కానీ, తాము నైతిక విలువలు పాటించామని, యూజర్లకు, డివైజ్‌ మేకర్లకు ఎలాంటి నష్టం చేయకుండానే యాప్‌ మార్కెట్‌లో టాప్‌ పొజిషన్‌కు చేరామని గూగుల్‌ వెల్లడించింది.  

అయితే గూగుల్‌ నిజాయితీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈయూ రెగ్యులేటర్‌ అథారిటీలు.. యాపిల్‌ విషయంలో మాత్రం కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నాయని గూగుల్‌ తరపు న్యాయవాది మెరెడిథ్‌ పిక్‌ఫోర్డ్‌ ఆరోపించారు. ప్లేస్టోర్‌, యాప్‌ మార్కెటింగ్‌లోనే కాదు.. ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌తో పోలిస్తే అన్ని వ్యవహారాల్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్న యాపిల్‌ను అలా ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు.

చదవండి:  దెబ్బకు దిగొచ్చిన గూగుల్‌.. సంచలన నిర్ణయం

 

దీనిపై ఈయూ కమిషన్‌ తరపు లాయర్‌ నికోలస్‌ ఖాన్‌ స్పందించారు.  ఈ వ్యవహారంలో యాపిల్‌ను లాగడం సరికాదన్నారు. ఆండ్రాయిడ్‌తో పోలిస్తే యాపిల్‌ మార్కెట్‌ తక్కువ ఉందని స్పష్టం చేశాడు. గూగుల్‌ సెర్చ్‌ మొదలు, యాప్‌ స్టోర్‌.. ఇలా ప్రతీది బలవంతపు ఒప్పందాల ద్వారా చేయించింది గూగుల్‌ మాత్రమేనని ఖాన్‌ కోర్టులో వాదనలు వినిపించారు. 

ఇదిలా ఉంటే జర్మన్‌ ఫోన్‌ మేకర్‌ గిగాసెట్‌ కమ్యూనికేషన్స్‌ మాత్రం.. గూగుల్‌ను వెనకేసుకొస్తోంది. కమిషన్‌ నిర్ణయం వల్ల వ్యాపారంపై తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.  మరోవైపు ఫెయిర్‌సెర్చ్‌ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు.  ఇక ఈయూ కమిషన్‌.. ఇప్పటిదాకా రకరకాల ఫిర్యాదుల ఆధారంగా మొత్తం ఎనిమిది బిలియన్ల యూరోలను ఫైన్ల రూపంలో గూగుల్‌పై విధించింది.

చదవండి: గూగుల్‌క్రోమ్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్త మీకోసమే

మరిన్ని వార్తలు