ఎలక్ట్రిక్ వాహన ధరలు భారీగా పెరగనున్నయా.. ఎంత వరకు నిజం?

2 Dec, 2021 20:15 IST|Sakshi

ప్రస్తుత ప్రపంచంలో ఏ రంగంలో లేని పోటీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉంది. వారానికి ఒక కొత్త ఈవీ మార్కెట్లోకి వస్తుంది. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అనేక కొత్త కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ స్టెల్లాంటిస్ ఎన్.వి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్లోస్ టావరెస్ ఎలక్ట్రిక్ వాహన రంగంపై రాయిటర్స్ నెక్ట్స్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఆటోమేకర్లపై పడుతున్న బాహ్య ఒత్తిడి వల్ల భవిష్యత్ లో ఈవీ వాహనాల ధరలు పెరగడంతో పాటు, ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

అధిక ఖర్చులు
ప్రస్తుతం, ప్రభుత్వాలు & పెట్టుబడిదారులు, కార్ల తయారీదారులు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం ఖర్చులు "పరిమితులకు మించి" అధికంగా ఉన్నాయని టావరెస్ చెప్పారు. కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాహనాల ధరలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనలను తయారు చేయడానికి 50 శాతం అధిక ఖర్చు అవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ 50 శాతం అదనపు ఖర్చులను తుది వినియోగదారుడికి బదిలీ చేసే అవకాశం లేదు, ఎందుకంటే మధ్య తరగతి ప్రజలు ఆ ధరలు భరించలేరు. దీంతో, ఈ సమస్య నుంచి గట్టు ఎక్కడానికి ఆటోమేకర్లు అధిక ధరలకు వాహనలను విక్రయించాలి లేదా తక్కువ లాభాలకు విక్రయించాల్సి ఉంటుంది అని టావరెస్ తెలిపారు. 

(చదవండి: ‘ఆధార్‌ కార్డు’ మోడల్‌..! ప్రపంచ వ్యాప్తంగా...!)

ఈ ఖర్చులను తగ్గించడానికి ప్రస్తుతం అనేక కంపెనీలు కొత్త టెక్నాలజీ మీద పనిచేస్తున్నాయి. అందుకే, ఎలక్ట్రిక్ వాహనాల ఖర్చును తగ్గించడానికి ఆటోమేకర్లకు కొంత సమయం అవసరం అని ఆయన తెలిపారు. అలా కాకుండా, ప్రజలను వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం ప్రోత్సహిస్తే డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే, నాణ్యత తక్కువ గల వాహనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అన్నారు. దీనివల్ల బ్యాటరీలలో సమస్య రావడం, వాహనాలు పేలడం వంటి ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 

కృత్రిమ డిమాండ్‌తో సమస్యలు
కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ఇంటర్వ్యూలో అన్నారు. ప్రస్తుతం, కొన్ని దేశాలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి పెట్రోల్, డీజిల్ వాహనల వాడకాన్ని నిషేదిస్తున్నాయి. అలా కాకుండా, ఎలక్ట్రిక్ వాహనలను క్రమ క్రమంగా పెంచుకుంటూ పోతూ ఇతర వాహనలను తగ్గించడం వల్ల ఇటు కంపెనీలకు, ప్రజలకు మంచిది అని ఆయన అన్నారు. ఇలా కృత్రిమ డిమాండ్ వల్ల అనేక దేశాలలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉన్నట్లు కార్లోస్ టావరెస్ తెలిపారు.   

(చదవండి: జుకర్‌ బర్గ్‌ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా?)

మరిన్ని వార్తలు