పెట్రోల్‌ వాహనాలతో సమానంగా ఈవీల రేట్లు

18 Jun, 2022 06:35 IST|Sakshi

ఏడాదిలోగా తగ్గించేందుకు ప్రయత్నాలు

కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ: ఏడాది వ్యవధిలోగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) ధరలు పెట్రోల్‌ వాహనాల రేట్లతో సమాన స్థాయికి తగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ స్థానంలో పంటల వ్యర్ధాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా శిలాజ ఇంధనాల దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చని గడ్కరీ పేర్కొన్నారు.

ప్రస్తుతం బ్యాటరీల వ్యయాలు భారీగా ఉండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాల రేట్లు చాలా అధిక స్థాయిలో ఉంటున్నాయి. వాహనం ధరలో బ్యాటరీల వాటా 35–40 శాతం మేర ఉంటుంది. ప్రస్తుతం ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో సంప్రదాయ ఇంధనాల వాహనాలతో పోలిస్తే ఎంట్రీ స్థాయి ఈవీ రేటు దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇక ద్విచక్ర వాహనాల విభాగంలోనూ పెట్రోల్‌ మోడల్స్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వెర్షన్ల రేటు 1.5 రెట్లు ఎక్కువగా ఉంటోంది. కాలుష్యకారక ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునే దిశగా పర్యావరణహిత విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.

>
మరిన్ని వార్తలు