తప్పని అవాంఛిత కాల్స్‌ బెడద - సర్వేలో బయటపడ్డ విషయాలు

27 Feb, 2024 06:47 IST|Sakshi

డు నాట్‌ డిస్టర్బ్‌ (డీఎన్‌డీ) లిస్ట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత కూడా చాలా మంది మొబైల్‌ ఫోన్‌ యూజర్లకు అవాంఛిత కాల్స్‌ బెడద తప్పడం లేదు. ఆర్థిక సేవలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, ఇతరత్రా ఉత్పత్తుల గురించి తమకు స్పామ్‌ కాల్స్‌ వస్తూనే ఉన్నాయంటూ లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది తెలిపారు. 

సర్వేలో అడిగిన ఏడు ప్రశ్నలకు 378 జిల్లాల నుంచి 60,000 పైచిలుకు సమాధానాలు వచ్చినట్లు లోకల్‌సర్కిల్స్‌ తెలిపింది. గతేడాది నవంబర్‌ 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 16 మధ్య కాలంలో దీన్ని నిర్వహించారు. అవాంఛిత కాల్స్‌ సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు రోజుకు తమకు 1–2 కాల్స్‌ వస్తూనే ఉంటాయని 90 శాతం మంది, 10కి పైగా కాల్స్‌ వస్తుంటాయని 3 శాతం మంది పేర్కొన్నారు. 

ఒక బడా లిస్టెడ్‌ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి అత్యధికంగా కాల్స్‌ ఉంటున్నాయని 40 శాతం మంది వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో ఒక పేరొందిన లిస్టెడ్‌ ప్రైవేట్‌ రంగ బ్యాంకు ఉంది. 

అవాంఛిత కాల్స్‌ను కట్టడి చేసేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గత కొన్నేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు కనిపించడం లేదని లోకల్‌సర్కిల్స్‌ వ్యవస్థాపకుడు సచిన్‌ తపాడియా చెప్పారు.

whatsapp channel

మరిన్ని వార్తలు