ఎవరెడీ- వొడాఫోన్‌ ఐడియా జోరు

17 Nov, 2020 13:41 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాలు

10 శాతం దూసుకెళ్లిన ఎవరెడీ ఇండస్ట్రీస్

‌డిసెంబర్‌ నుంచి టారిఫ్‌ల పెంపు అంచనాలు

10 శాతం జంప్‌చేసిన వొడాఫోన్‌ ఐడియా

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌ ఇండియా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఈ ఏడాది చివరికల్లా టారిఫ్‌లను పెంచనున్నట్లు వెలువడిన వార్తలతో మొబైల్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (వ్యాక్సిన్‌ ఆశలు‌- యూఎస్‌ కొత్త రికార్డ్స్‌)

ఎవరెడీ ఇండస్ట్రీస్‌ ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 57 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 373 కోట్లకు చేరింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు 7 శాతం క్షీణించి రూ. 318 కోట్లను తాకాయి. స్టాండెలోన్‌ ప్రాతిపదికన నిర్వహణ లాభ మార్జిన్లు 9 శాతం నుంచి 20 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 172ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! 

వొడాఫోన్‌ ఐడియా
నష్టాలను తగ్గించుకోవడం, ఆర్థికంగా పటిష్టంకావడంపై దృష్టిపెట్టిన వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌లను 15-20 శాతంమేర పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్‌లో పెంపును చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టెలికం నియంత్రణ సంస్థ ఫ్లోర్‌ ధరలను నిర్ణయించనుందని, అయితే వొడాఫోన్‌ ఐడియా వచ్చే నెల మొదట్లోనే 25 శాతం వరకూ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలు వేసినట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి. 2016లో రిలయన్స్‌ జియో రంగ ప్రవేశం చేశాక టెలికం దిగ్గజాలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా 2019లో తొలిసారి రేట్లను పెంచినట్లు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఎన్‌ఎస్‌ఈలో వొడాఫోన్‌ ఐడియా షేరు 10 శాతం లాభపడి రూ. 10ను తాకింది. ప్రస్తుతం 6 శాతం ఎగసి రూ. 9.65 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు