ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్లకు ఆరు నెలల జైలు

23 Sep, 2022 04:53 IST|Sakshi

సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: జపాన్‌ సంస్థ దైచీ సాంక్యోకు ర్యాన్‌బాక్సీ విక్రయ వ్యవహారంలో పలు అంశాలను దాచిపెట్టడం, ఈ కేసు విచారణలో ఉండగా.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ తమ ఫోర్టిస్‌ షేర్లను మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌కు విక్రయించిన కేసులో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్లు మల్వీందర్‌ సింగ్, శివిందర్‌ సింగ్‌లకు సుప్రీంకోర్టు గురువారం 6 నెలల జైలు శిక్ష విధించింది.

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో 26 శాతం వాటా కోసం ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్‌ ఇచ్చిన ఓపెన్‌ ఆఫర్‌పై విధించిన స్టే ఎత్తివేసేందుకూ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.  2018 ఫోర్టిస్‌–ఐఐహెచ్‌ ఒప్పందంపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేసును తిరిగి ఢిల్లీ హైకోర్టుకు విచారణ నిమిత్తం రిమాండ్‌ చేసింది.

దైచి– ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్ల మధ్య  చట్టపరమైన పోరాటం కారణంగా ఐహెచ్‌హెచ్‌–ఫోర్టిస్‌ ఒప్పందం నిలిచిపోయింది. ఫోర్టిస్‌–ఐహెచ్‌హెచ్‌ షేర్‌ డీల్‌ను దైచీ సాంక్యో సవాలు చేసింది. జపనీస్‌ డ్రగ్‌ మేకర్‌ దైచీ 2008లో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ యజమానులైన సింగ్‌ సోదరుల నుండి ర్యాన్‌బాక్సీ కొనుగోలు చేసింది. అయితే పలు అంశాలు దాచిపెట్టి ఈ ఒప్పందం చేసుకున్నారని దైచీ ఆరోపిస్తూ, సింగ్‌ సోదరులపై న్యాయపోరాటాన్ని జరిపింది.  సింగ్‌ సోదరులకు వ్యతిరేకంగా సింగపూర్‌ ట్రిబ్యునల్‌లో  రూ.3,600 కోట్ల ఆర్బిట్రేషన్‌ అవార్డు అమలుకు దైచీ న్యాయపోరాటం చేస్తోంది.

షేర్‌ భారీ పతనం..: కాగా,  ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌కు షేర్‌ అమ్మకాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలన్న సుప్రీం ఆదేశాల అనంతరం ఫోర్టిస్‌ ఒక ప్రకటన చేస్తూ, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ షేర్‌ 15% పడిపోయి రూ.265.55 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు