లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీలో ఎక్సైడ్‌

11 Mar, 2022 10:36 IST|Sakshi

కోల్‌కతా: స్టోరేజీ బ్యాటరీ తయారీ సంస్థ ‘ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌’ లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ దిశగా కీలక ముందడుగు వేసింది. చైనాకు చెందిన ‘స్వోల్ట్‌ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్‌’తో బహుళ సంవత్సరాల సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘‘ఈ ఒప్పందం కింద.. లిథియం అయాన్‌ సెల్‌ తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, టెక్నాలజీ వాణిజ్యీకరణకు అవసరమైన హక్కులు, లైసెన్స్‌ లభిస్తాయి. టర్న్‌కీ ప్రాతిపదికన గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని సైతం స్వోల్ట్‌ అందిస్తుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నాయి’’ అని ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.

దేశంలో స్టోరేజీ బ్యాటరీలకు సంబంధించి కేంద్ర సర్కారు తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ సైతం ప్రోత్సాహకాలకు ఎంపికవడం తెలిసిందే. స్వోల్ట్‌కు ఉన్న పటిష్టమైన సాంకేతికతకుతోడు, లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీలో ఉన్న గొప్ప అనుభవం ఆసరాగా.. మల్టీ గిగావాట్‌ లిథియం అయాన్‌ సెల్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు ఎక్సైడ్‌ తెలిపింది.   
 

మరిన్ని వార్తలు