కోవిడ్‌ టీకాలకు.. రూ.750 ‍కోట్లు

27 Nov, 2021 13:10 IST|Sakshi

- టీకా ఉత్పత్తుల కోసం అందుబాటులో రుణాలు 

- ఆవిష్కరణలకు హబ్‌గా హైదరాబాద్‌ 

- ఎగ్జిమ్‌ బ్యాంక్‌ డీఎండీ రమేష్‌ వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 టీకాలు, తత్సంబంధ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దేశీ సంస్థలకు దాదాపు 100 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 750 కోట్లు) మేర రుణాలు సమకూరుస్తున్నట్లు ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌) డిప్యుటీ ఎండీ ఎన్‌ రమేష్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు ఆరు సంస్థలకు వీటిని అందిస్తున్నట్లు శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు.

హబ్‌గా హైదరాబాద్‌
నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్‌ హబ్‌గా ఎదిగిందని రమేష్‌ ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి దశలో ఉన్న కొన్ని సంస్థలను గుర్తించి, నిర్దిష్ట పథకం కింద వాటికి కావాల్సిన తోడ్పాటు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే మూడు సంస్థలకు సుమారు రూ. 70–100 కోట్ల దాకా సమకూరుస్తున్నట్లు రమేష్‌ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సంస్థలు మరో పదింటిని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉభర్‌తే సితారే పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద దేశవ్యాప్తంగా 30 సంస్థలకు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి సుమారు 100 కంపెనీలకు తోడ్పాటు అందించనున్నట్లు రమేష్‌ చెప్పారు. ప్రస్తుతం ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రుణ పోర్ట్‌ఫోలియో దాదాపు రూ. 1.1 లక్ష కోట్లుగా (ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి) ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 శాతం వృద్ధి నమోదు కాగలదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందిన నిధుల ఊతంతో వచ్చే అయిదేళ్లలో దాదాపు 7 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగు మతి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని నిర్దేశించుకున్నట్లు రమేష్‌ వివరించారు. 
 

మరిన్ని వార్తలు