సొంత ఇంటికి సరైన వ్యూహం ఏది?

28 Dec, 2020 13:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సొంత ఇంటిని సమకూర్చుకోవడమనేది నా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్లో ఒకటి. అయితే వీలైనంత త్వరగా దీనిని నెరవేర్చుకోవడానికి ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి?  
– కిరణ్, హైదరాబాద్‌

వీలైనంత ఎక్కువగా డౌన్‌ పేమెంట్‌ ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా మీరు ఇంటి కోసం చెల్లించే ఈఎమ్‌ఐ(ఈక్వేటెడ్‌ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌) మీ జీతంలో మూడో వంతు మించకుండా ఉండాలి.  మీరు చెల్లించే ఈఎమ్‌ఐ మీ జీతంలో మూడో వంతుకు మించి ఉన్నప్పుడు ఆర్థికంగా మీపై భారం పడుతుంది. మీరు నివసించాలనుకునే చోటే ఇల్లు కొనుక్కోండి. మీరు నివసించని చోట ఇల్లు కొనుక్కోవాలనుకోవడం అర్థం లేని చర్య. అంటే మీరు వేరొక ఇంట్లో అద్దెకు ఉంటూ, ఇంకొకచోట ఇల్లు కొనాలనుకోవడం సరైనది కాదు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి.  

ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్స్‌(ఎఫ్‌ఎమ్‌పీ) రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గతంలో పనితీరు బాగా ఉంది కదాని మూడు ఎఫ్‌ఎమ్‌పీల్లో ఇన్వెస్ట్‌ చేశాను. ఇప్పుడు మాత్రం పరిస్థితులు బాగా లేవు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి?
– పల్లవి, విజయవాడ  

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌  సంక్షోభం బయటపడిన తర్వాత ఎఫ్‌ఎమ్‌పీల రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఒకప్పుడు ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్లాన్స్‌ ఇప్పుడు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. నిజానికి చెప్పాలంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇవి మంచి సాధనాలే. నిర్దేశిత కాలానికి నిర్ణీత మొత్తంలో రాబడులను ఆశించే వారికి ఇవి ఉపయుక్తం. కొంతమంది ఫండ్‌ మేనేజర్ల అజాగ్రత్త, అతి జాగ్రత్తల కారణంగా ప్రస్తుతం ఎఫ్‌ఎమ్‌పీలు ఆశించిన రాబడులను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త ఎఫ్‌ఎమ్‌పీలు కూడా రావడం లేదు. ఎఫ్‌ఎమ్‌పీ వంటి క్లోజ్‌డ్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడ్‌ కావలసి ఉంటుంది. మీరు ఎఫ్‌ఎమ్‌పీల నుంచి వైదొలగాలంటే ఇదొక్క మార్గం ఉంది. అయితే స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో ట్రేడింగ్‌ లావాదేవీలు చాలా స్వల్పంగా ఉంటాయి. లేదంటే ఈ ప్లాన్‌లు మెచ్యూర్‌ అయ్యేదాకా వేచి చూడడం తప్ప మరో మార్గం లేదు.  

ఇటీవలనే ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నవనీత్‌ మునోత్‌ వైదొలగారని వార్తలు వచ్చాయి. ఆయన నిష్క్రమణ ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరుపై ఏమైనా ప్రభావం చూపుతుందా?     
– తమీమ్, హైదరాబాద్‌  

నవనీత్‌ మునోత్‌ వైదొలగడం వల్ల ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరుపై ఏమైనా ప్రభావం పడుతుందనే విషయమై వ్యాఖ్యానించడం  తొందరపాటు చర్యే అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఫండ్స్‌ పనితీరు బాగానే ఉంది. ఎస్‌బీఐలో ఉన్న ఇతర ఫండ్‌ మేనేజర్లు–ఆర్‌.శ్రీనివాసన్, అనుప్‌ ఉపాధ్యాయ్, సోహిని అందాని... తదితరులు కూడా మంచి సామర్థ్యం గలవారే. అయితే ఎస్‌బీఐ ఇన్వెస్ట్‌మెంట్‌ టీమ్‌లో నవనీత్‌ మునోత్‌ కీలకమైన వ్యక్తే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఆయన నిష్క్రమణ వల్ల ఎస్‌బీఐ ఫండ్స్‌ పనితీరు ప్రభావితమయ్యే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. అయితే ఇలాంటి కీలకమైన వ్యక్తులు వైదొలగిన సందర్భాల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఫండ్స్‌ పనితీరును సమీక్షిస్తుండాలి. సంవత్సరం, లేదా సంవత్సరన్నర కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఫండ్స్‌ పనితీరును మదింపు చేయాలి. మీరు ఆశించిన స్థాయిల్లో ఈ ఫండ్స్‌ పనితీరు లేని పక్షంలో ఆయా ఫండ్స్‌ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలించవచ్చు. (చదవండి: 2021లో కొత్త మార్పులు- మీరు రెడీనా?)

మరిన్ని వార్తలు