అన్‌లాక్, అంతర్జాతీయ అంశాలే కీలకం..!

7 Jun, 2021 03:35 IST|Sakshi

కరోనా సంబంధిత, రుతుపవనాల రాకపై దృష్టి 

రూపాయి, క్రూడాయిల్‌ కదలికలూ ముఖ్యమే 

బుల్లిష్‌ వైఖరి ప్రదర్శిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు 

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో సానుకూలతలు 

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం 

ముంబై: కరోనా సంబంధిత వార్తలు, లాక్‌డౌన్‌ అన్‌లాక్‌ ప్రక్రియ, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల రాక వార్తలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్‌ధరలు, రూపాయి ట్రేడింగ్, విదేశీ ఇన్వెస్టర్లు వైఖరి అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. ‘‘దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సరళతరం చేస్తున్నాయి. కరోనా తగ్గేంత వరకు సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని గతవారంలో ఆర్‌బీఐ భరోసానిచ్చింది. భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడొచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ అంశాలన్నీ సూచీల రికార్డు ర్యాలీని కొనసాగించేలా ప్రోత్సహించవచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. గత వారంలో సెన్సెక్స్‌ 677 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తే.., 


సెంటిమెంట్‌ను బలపరుస్తున్న అన్‌లాక్‌ ప్రక్రియ.. 
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలను పొడిగిస్తూనే.. అనేక సడలింపులు ఇస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మే 31 నుంచే ‘అన్‌లాక్‌’ ప్రక్రియ ప్రారంభమైంది. మార్కెట్లు, మాల్స్‌ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నాయి. నేటి(సోమవారం)నుంచి మెట్రో రైళ్లు 50% రవాణా సామర్థ్యంతో ప్రయాణించనున్నాయి. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర కోవిడ్‌ నిబంధనలను ఐదు అంచెల్లో సడలించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలను పొడిగిస్తూనే.. అనేక సడలింపులు ఇస్తున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియతో ఆర్థిక రికవరీ తిరిగి గాడిన పడవచ్చనే ఆశలు మార్కెట్లో సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. 


అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి... 
అమెరికా శుక్రవారం మే నెల ఉద్యోగ గణాంకాలను వెల్లడించింది. యూఎస్‌ ఆర్థికవేత్తలు మేలో 6.50 లక్షల ఉద్యోగాల సృష్టి జరగొచ్చని ఆశించగా, 5.59 లక్షల ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగింది. దీంతో ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీని కఠినతరం చేయవచ్చనే ఆందోళనలు ఉపశమించాయి. జపాన్‌ ఈ మంగళవారం తొలి క్వార్టర్‌ జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. చైనా బుధవారం మే నెల ద్రవ్యోల్బణ, పీపీఐ డేటాను వెల్లడించనుంది. ఈసీబీ (యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌) గురువారం వడ్డీరేట్లను ప్రకటించనుంది. అదేరోజున(గురువారం) అమెరికా మే ద్రవ్యోల్బణ డేటాను, చైనా శుక్రవారం మే వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబింపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. 


రుతుపవనాలు, క్యూ4 ఫలితాలు... 
దేశంలోకి రుతుపవనాల రాక ఆలస్యమైనా.., ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో మార్కెట్లో సానుకూలతలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల విషయానికొస్తే.., ఇప్పటికే అధిక వెయిటేజీ షేర్లను కలిగిన కంపెనీలు ఫలితాలను వెల్లడించాయి. బాటా ఇండియా, గెయిల్, సెయిల్, భెల్, డీఎల్‌ఎఫ్‌ లాంటి కీలకమైన కంపెనీలు ఈ వారంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. 


ఐఐపీ గణాంకాలు శుక్రవారం విడుదల... 
ఇదే వారంలో శుక్రవారం ఏప్రిల్‌ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. లో బేస్‌ కారణంగా వార్షిక ప్రాతిపదికన 186 శాతం వృద్ధి నమోదుకావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది.

నాలుగు రోజుల్లో రూ.8,000 కోట్ల పెట్టుబడులు...
భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జూన్‌ నెల తొలి నాలుగురోజుల్లోనే ఏకంగా రూ.8,000 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. కరోనా కేసుల తగ్గుదల, కార్పొరేట్ల మెరుగైన ఆర్థిక ఫలితాలు కొనుగోళ్లను ప్రేరేపించాయని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. ఇక మేలో ఎఫ్‌ఐఐలు రూ.2,954 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు