సిల్వర్‌ ఈటీఎఫ్, సెన్సెక్స్‌/నిఫ్టీ ఇండెక్స్‌ మధ్య వ్యత్యాసాం ఏంటి?

28 Feb, 2022 13:47 IST|Sakshi

నేను సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్‌ లేదా నెలవారీ సిప్‌ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్‌ సహాని 
నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచి్ఛకంగా ఉంటాయని తెలుసు. అది కూడా అధిక స్థాయిలో. భిన్న పథకాలను ఎంపిక చేసుకుని భిన్న కాలాలకు పోల్చి చూస్తే ఫలితాలు అంతే యాదృచ్ఛికంగా ఉంటాయి. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా చేస్తున్నాం కదా అని వాదించొచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్‌ అమలు చేయాలి? అందుకే దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్‌ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. 

సిల్వర్‌ ఈటీఎఫ్, సెన్సెక్స్‌/నిఫ్టీ ఇండెక్స్‌ మధ్య వ్యత్యాసాం ఏంటి?   – అనూప్‌ 
సెన్సెక్స్‌ లేదా నిఫ్టీ అన్నవి స్టాక్‌ మార్కెట్లకు సంబంధించి ప్రధాన సూచీలు. నిఫ్టీ 50 స్టాక్స్‌తో, సెన్సెక్స్‌ 30 స్టాక్స్‌తో ఉంటుంది. ఇండెక్స్‌ ఫండ్స్‌ అన్నవి ఈ సూచీల్లోని భిన్న కంపెనీల్లో వాటి వెయిటేజీకి తగ్గట్టు ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ ఫథకాల్లో రాబడులు సూచీలకు సమానంగా ఉంటాయి. ఎక్స్‌పెన్స్‌ రేషియో, ట్రాకింగ్‌ ఎర్రర్‌ అంశాల ఆధారంగా నికర రాబడుల్లో కొంత వ్యత్యాసం ఉండొచ్చు. సిల్వర్‌ ఈటీఎఫ్‌లు అన్నవి పెట్టుబడిదారుల నుంచి అందుకున్న మొత్తాన్ని వెండిపై పెట్టుబడిగా పెడతాయి. వెండి ధరల పెరుగుదలపై రాబడులు ఆధారపడి ఉంటాయి. రాబడుల నుంచి వ్యయాలను మినహాయించాల్సి ఉంటుంది. అలాగే, వెండి ధర, ఈటీఎఫ్‌ ధర మధ్య పనితీరు వ్యత్యాసం కూడా రాబడులపై ప్రభావం చూపిస్తుంది. ఇండెక్స్‌ ఫండ్స్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. సిల్వర్‌ ఈటీఎఫ్‌ వెండిపై ఇన్వెస్ట్‌ చేస్తుందంతే.  

నా యవసు 72 ఏళ్లు. నేను ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సురక్షితమేనా? లేదంటే సంప్రదాయ లేదా బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఎంపిక చేసుకోవాలాలా?   – భాస్కర్‌  
ఇది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో ఉన్న అనుభవం ఏ మేరకు? ఒకవేళ ఈక్విటీల్లో ముందు నుంచి ఇన్వెస్ట్‌ చేస్తూ మూడేళ్లకు పైగా అనుభవం ఉండి, మార్కెట్లలో ఎత్తు, పల్లాలను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. చూడాల్సిన మరో అంశం మీకు కావాల్సిన ఆదాయ అవసరాలు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే మొత్తం ఆదాయం కోరుకునేది కాకుండా, పెట్టుబడి అయితే అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల్లో ఎటువంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మార్కెట్లో మీకున్న అనుభవం, ఆదాయంపై మీ అంచనాల ఆధారంగానే ఎంపిక ఉండాలి.  

- ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వాల్యూ రీసెర్చ్‌)

మరిన్ని వార్తలు