ఈ షేర్లు... తారాజువ్వలు!

4 Nov, 2021 12:19 IST|Sakshi

Üసంవత్‌ 2078పై కోటి ఆశలు

ఆకర్షణీయంగా పర్యాటకం, రియల్టీ, బ్యాంకింగ్‌ తదితర రంగాల షేర్లు  

ఇన్వెస్టర్లకు సంవత్‌ 2077 బంపర్‌గా గడిచింది. ప్రజలను కరోనా భయాలు వెంటాడుతున్నా.. దేశీ మార్కెట్లు మాత్రం తారాజువ్వల్లాగా దూసుకెళ్లిపోయాయి. స్మాల్, మిడ్‌.. లార్జ్‌ క్యాప్‌ అనే భేదం లేకుండా అన్ని విభాగాల్లోని షేర్లూ గణనీయంగా పెరిగాయి. గతేడాది దీపావళి నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ దాకా చూస్తే నిఫ్టీ, సెన్సెక్స్‌ దాదాపు 40 శాతం రాబడులు అందించగా.. మిడ్‌క్యాప్‌ సూచీలు 60 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీలు 79.7 శాతం మేర రాణించాయి. కరోనా కేసుల కారణంగా అంతటా నిస్పృహ, నిరాశ నెలకొన్న పరిస్థితుల్లో ఊహకు కూడా అందని విధంగా స్టాక్‌ మార్కెట్లు ఎగిశాయి. 

కారణాలు
అంతర్జాతీయంగా నిధుల లభ్యత పెరగడం, ఆర్థిక విధానాలు సానుకూలంగా ఉండటం, ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో డీమ్యాట్‌ ఖాతాలు (2021లో 2 కోట్ల పైచిలుకు) తెరవడం, టీకాలతో మహమ్మారిని కొంత కట్టడి చేయగలగడం, ఇంధన ధరలు పెరగడం, రిస్క్‌ సామర్థ్యాలు పెరగడం వంటి అంశాలు స్టాక్‌ మార్కెట్‌లో జోష్‌కి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్‌ 2078లోనూ మార్కెట్లు మరింత ఎగిసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఫిక్సిడ్‌ డిపాజిట్లపై వచ్చే రాబడులు తగ్గడం, దేశీ ఇన్వెస్టర్ల రిస్కు సామర్థ్యాలు పెరగడం, జీడీపీ వృద్ధి మెరుగుపడుతుండటం, టీకా ప్రక్రియ పుంజుకుంటూ ఉండటం ఇందుకు దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ రంగాల్లో
ట్రావెల్, టూరిజం, రియల్‌ ఎస్టేట్‌ దాని అనుబంధ రంగాలు మొదలైనవి మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయని బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. మరోవైపు, హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా రంగాలు ఆశావహంగా ఉండగలవని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్‌లో మెరిసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని బ్రోకరేజి సంస్థలు సూచిస్తున్న స్టాక్స్‌ కొన్ని మీకోసం. 


బ్రోకింగ్‌ సంస్థ: ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 
ప్రస్తుత ధర రూ. 2,036 
టార్గెట్‌ ధర రూ. 2,721 
వృద్ధి: 33% 

దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. ప్రస్తుతం వ్యాపార పరిమాణం రూ. 4.8 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేట్‌ గవర్నెన్స్, అసెట్‌ క్వాలిటీ, మెరుగైన మార్జిన్లు, రాబడులు దీనికి సానుకూల అంశాలు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ మొండి బాకీలు మరింత తగ్గగలవు. వ్యయాలు తగ్గించుకునే దిశగా డిజిటల్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రతి నెలా డిజిటల్‌ మాధ్యమం ద్వారా 5 లక్షల పైచిలుకు కస్టమర్లను చేర్చుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించడం, లాక్‌డౌన్‌లు విధిస్తే రిటైల్‌ సెగ్మెంట్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం, ఫిన్‌టెక్‌ కంపెనీల నుంచి పోటీ వంటివి బాంకుకు ప్రతికూలాంశాలు కాగలవు. 
..
కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 
ప్రస్తుత ధర రూ. 292
టార్గెట్‌ ధర రూ. 358
వృద్ధి: 22% 

వివిధ మౌలిక రంగ ప్రాజెక్టుల అభివృద్ధిలో రెండు దశాబ్దాలపైగా అనుభవం. పటిష్టమైన ఇన్‌హౌస్‌ ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ సేవలు) విభాగం. ఇన్‌ఫ్రా రంగంలో దిగ్గజ సంస్థలతో సత్సంబంధాల కారణంగా సంయుక్తంగా బిడ్డింగ్‌ చేయడం ద్వారా ప్రాజెక్టులు దక్కించుకునేందుకు మెరుగైన అవకాశాలు. 
గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ 
ప్రస్తుత ధర రూ. 1,786 
టార్గెట్‌ ధర రూ. 2,151 
వృద్ధి: 20% 

ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన కంపెనీ. దేశీయంగా విస్కస్‌ స్టేపుల్‌ ఫైబర్‌ (వీఎస్‌ఎఫ్‌), లినెన్, ఇన్సులేటర్స్‌ తయారీ సంస్థ. అల్ట్రాటెక్‌ సిమెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ వంటి అనుబంధ సంస్థలున్నాయి. డెకరేటివ్‌ పెయింట్స్‌ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. వచ్చే రెండేళ్లలో వ్యాపారాలపై రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఆకర్షణీయమైన వేల్యుయేషన్‌లో లభిస్తోంది. చైనా నుంచి సరఫరాపరమైన ఆటంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్, ముడి వస్తువులు..విద్యుత్, ఇంధనాల ఖర్చులు పెరగడం తదితర రిస్కులు పొంచిఉన్నాయి.  
..
చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ 
ప్రస్తుత ధర రూ. 612
టార్గెట్‌ ధర రూ.774
వృద్ధి: 26% 

ఇది మురుగప్పా గ్రూప్‌లో భాగమైన ఆర్థిక సేవల విభాగం. గృహ, వాహన రుణాలు, స్టాక్‌ బ్రోకింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ సేవలు మొదలైనవి అందిస్తోంది. నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 67000 కోట్ల పైగా ఉంది. దాదాపు 16.6 లక్షల పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏయూఎం వార్షికంగా 7 శాతం వృద్ధి నమోదు చేసింది. మహమ్మారి కారణంగా వసూళ్లపై అనిశ్చితి,హామీగా పెట్టుకున్న వాటి విలువలో అత్యధిక శాతం రుణం ఇవ్వడం తదితర అంశాలు ప్రధానమైనరిస్కులు. 
సుందరం ఫాజెనర్స్‌ 
ప్రస్తుత ధర రూ.836 
టార్గెట్‌ రూ.1,059 
వృద్ధి: 26% 

ఆటోమోటివ్, ఇన్‌ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్‌ తదితర రంగాలకు అవసరమైన పవర్‌ ట్రెయిన్‌ విడిభాగాలు, మెటల్‌ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్‌ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్‌ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్‌ సెగ్మెంట్‌లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. 
బ్రోకింగ్‌ సంస్థ: ఏంజెల్‌ బ్రోకింగ్‌
ఫెడరల్‌ బ్యాంక్‌ 
ప్రస్తుత ధర రూ.100
టార్గెట్‌ ధర రూ.135
వృద్ధి: 35% 

పేరొందిన పాత తరం ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఒకటి. బ్యాంక్‌ మొత్తం అసెట్స్‌ రూ. 2.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిపాజిట్లు రూ. 1.72 లక్షల కోట్లుగా, ఇచ్చిన రుణాలు రూ. 1.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రొవిజనింగ్‌ తగ్గింది. అసెట్‌ క్వాలిటీ మెరుగుపడింది. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 
ప్రస్తుత ధర రూ.1582
టార్గెట్‌ ధర రూ.1,859
వృద్ధి: 17% 

దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో అతి పెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం. డిపాజిట్లు రూ. 14 లక్షల కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 12 లక్షల కోట్లుగాను ఉన్నాయి. రిటైల్‌ రుణాల వాటా 46 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో ఎన్‌పీఏలు తగ్గడంతో ఊహించిన దానికన్నా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అసెట్‌ క్వాలిటీ మెరుగ్గా ఉండటం, ద్వితీయార్ధం వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండటం తదితర అంశాలు ఈ స్టాక్‌కు సానుకూలమైనవి. 


సుప్రజిత్‌ ఇంజినీరింగ్‌ 
ప్రస్తుత ధర రూ.373 
టార్గెట్‌ ధర రూ.425
వృద్ధి: 13% 

సుప్రజిత్‌ ఇంజినీరింగ్‌ దేశీయంగా ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్యాసింజర్‌ వాహనాల సంస్థలకు ఆటోమోటివ్‌ కేబుల్స్‌ సరఫరా చేస్తోంది. ఉత్పత్తులను చౌకగా అందించడం ద్వారా మార్కెట్‌ షేరును పెంచుకోవడంతో పాటు ప్రస్తుత కస్టమర్ల నుంచి మరింతగా ఆర్డర్లు దక్కించుకుంటోంది. వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచుకునే కొద్దీ సుప్రజిత్‌ కూడా గణనీయంగా ప్రయోజనాలు పొందగలదు. 


అశోక్‌ లేల్యాండ్‌ 
ప్రస్తుత ధర రూ.143
టార్గెట్‌ ధర రూ.175 
వృద్ధి: 22% 

దేశీయంగా వాణిజ్య వాహనాల విభాగ దిగ్గజాల్లో ఒకటి. మధ్య, భారీ స్థాయి కమర్షియల్‌ వాహనాల మార్కెట్లో సుమారు 28 శాతం వాటా ఉంది.  సీవీ సెగ్మెంట్‌ కోలుకునే కొద్దీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలగే సత్తా ఉంది. స్క్రాపేజీ పాలసీ వల్ల కూడా కంపెనీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. 

పీఐ ఇండస్ట్రీస్‌ 
ప్రస్తుత ధర రూ.2733 
టార్గెట్‌ ధర రూ.3,950
వృద్ధి: 44% 

అంతర్జాతీయ ఆగ్రోకెమికల్‌ కంపెనీలకు కస్టమ్‌ సింథసిస్, తయారీ సొల్యూషన్స్‌ (సీఎస్‌ఎం) అందిస్తోంది. కంపెనీ ఆదాయాల్లో ఈవిభాగం వాటా 70 శాతం పైగా ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ కెమికల్స్, ఫార్మా ఏపీఐ, ఫ్లోరో కెమికల్స్‌ మొదలైన వాటిల్లోకి విస్తరిస్తోంది.
బ్రోకింగ్‌ సంస్థ: యాక్సిస్‌ సెక్యూరిటీస్‌


ఏసీసీ లిమిటెడ్‌ 
ప్రస్తుత ధర రూ. 2,420
టార్గెట్‌ ధర రూ. 2,570
వృద్ధి: 6% 

వ్యయాల తగ్గింపు చర్యలు, ఉత్పత్తులకు భారీ డిమాండ్, మెరుగైన ధర మొదలైనవి కంపెనీకి సానుకూలాంశాలు. ప్రస్తుతం ఈ రంగంలోని మిగతా సంస్థలతో పోలిస్తే షేరు ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది. 

సైయంట్‌ 
ప్రస్తుత ధర రూ.1,105 
టార్గెట్‌ ధర రూ.1,300 
వృద్ధి: 17% 

దీర్ఘకాలిక కోణంలో కంపెనీ వ్యాపార స్వరూపం పటిష్టంగా మారింది. అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు సంస్థ చేతిలో ఉన్నాయి. రూపాయి మారకం తక్కువ స్థాయిలో ఉంటడం, ప్రయాణ వ్యయాలు.. ఆన్‌ సైట్‌ వ్యయాలు తగ్గటం వంటి కారణాలతో సమీప భవిష్యత్తులో సైయంట్‌ ఆదాయాలు మరింత మెరుగుపడవచ్చు. 

మైండ్‌ట్రీ 
ప్రస్తుత ధర రూ.4,627 
టార్గెట్‌ ధర రూ.5,100 
వృద్ధి: 10% 

ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించగలగడంతో పాటు ప్రాజెక్టులను సమర్ధంగా పూర్తి చేయగలిగే ట్రాక్‌ రికార్డు కంపెనీకి సానుకూలాంశం. రూపాయి క్షీణత, ప్రయాణ వ్యయాలు.. ఆన్‌ సైట్‌ వ్యయాలు తగ్గుతుండటం కలిసొచ్చే అంశాలు. 


ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ 
ప్రస్తుత ధర రూ.744 
టార్గెట్‌ ధర రూ.940 
వృద్ధి: 26% 

నవీకరించిన కొత్త వ్యాపార విధానం ఊతంతో తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతో పాటు మార్కెట్‌ వాటాను కూడా పెంచుకోగలిగే అవకాశం ఉంది.  బ్రాండ్‌ రీకాల్, వివిధ రకాల కస్టమర్లకు వినూత్న ఆఫర్లు అందిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం.  

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 
ప్రస్తుత ధర రూ.1,178 
టార్గెట్‌ ధర రూ.1,350 
వృద్ధి: 14% 

ప్రైవేట్‌ రంగ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఎస్‌బీఐ లైఫ్‌కు అత్యంత విస్తృతమైన బ్యాంక్‌ఎష్యూరెన్స్‌ నెట్‌వర్క్‌ ఉంది. కార్యకలాపాలను స్వల్ప వ్యవధిలో విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యయాలకు సంబంధించిన నిష్పత్తులు అత్యంత తక్కువగా ఉండటం వల్ల వ్యాపా రం నెమ్మదించినా మార్జిన్లపై ఎక్కువగా ప్రభావం పడకపోవడం, లాభదాయక పాలసీలపై దృష్టి పెడుతుండటం సంస్థకు సానుకూలాంశం. 

బ్రోకింగ్‌ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ 
సుందరం ఫాజెనర్స్‌ 
ప్రస్తుత ధర రూ. 836 
టార్గెట్‌ రూ. 1,059 
వృద్ధి: 26% 

ఆటోమోటివ్, ఇన్‌ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్‌ తదితర రంగాలకు అవసరమైన పవర్‌ ట్రెయిన్‌ విడిభాగాలు, మెటల్‌ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్‌ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్‌ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్‌ సెగ్మెంట్‌లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. 


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 
ప్రస్తుత ధర రూ. 101 
టార్గెట్‌ ధర రూ. 120 
వృద్ధి: 18% 

క్రమంగా కరోనా వైరస్‌ కట్టడిపరమైన ఆంక్షలను ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం తదితర అంశాల ఊతంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుంది. మొండిబాకీలను బ్యాడ్‌ బ్యాంక్‌కు బదలాయించడంతో ఎన్‌పీఏల భారం తగ్గుతుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రావాల్సిన బాకీలు కూడా క్రమంగా రికవర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

యాక్షన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ 
ప్రస్తుత ధర రూ. 253 
టార్గెట్‌ ధర రూ. 300 
వృద్ధి: 18% 

మెటీరియల్‌ హ్యాండ్లింగ్, నిర్మాణ రంగ పరికరాల వ్యాపారం పటిష్టంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు–నాలుగేళ్లలో 35–30 శాతం పెరగవచ్చని అంచనా. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీకి ఇది సానుకూలాంశం. 

బాటా ఇండియా 
ప్రస్తుత ధర రూ. 2,036 
టార్గెట్‌ ధర రూ. 2,380 
వృద్ధి: 17% 

వ్యయాలను తగ్గించుకోవడం, వివిధ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగించడం, ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు మొదలైనవి కంపెనీకి లాభించగలవు. అలాగే భారం పెంచుకోకుండా ఫ్రాంచైజీ విధానంలో రిటైల్‌ నెట్‌వర్క్‌ను క్రమంగా పెంచుకుంటూ ఉండటం సంస్థకు సానుకూల అంశం.

మహీంద్రా లైఫ్‌స్పేస్‌ 
ప్రస్తుత ధర రూ. 283 
టార్గెట్‌ ధర రూ. 325 
వృద్ధి: 14% 

పటిష్టమైన మాతృ సంస్థ తోడ్పాటు, కార్యకలాపాల స్థాయిని విస్తరించడంపై మేనేజ్‌మెంట్‌ మరింతగా దృష్టి పెడుతుండటం కంపెనీకి సానుకూల అంశాలు. కొత్తగా కొనుగోలు చేసిన స్థలాలతో రెసిడెన్షియల్‌ వ్యాపారాన్ని కూడా పెంచుకోవడానికి తోడ్పడగలదు. మధ్యకాలికంగా షేర్‌ టార్కెట్‌ను తాకవచ్చు.  


 

మరిన్ని వార్తలు