అశ్లీల, మార్ఫింగ్‌ వీడియోల కథ కంచికి! ఇకపై అలాంటివి చూడలేరు

8 Jan, 2022 12:58 IST|Sakshi

ఇంటర్నెట్‌లో సైట్లను బ్లాక్‌ చేసినా మన దేశంలో అశ్లీల కంటెంట్‌ వీక్షణకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటున్నాయి. ఆఖరికి సోషల్‌ మీడియా అకౌంట్‌లలోనూ వీటి హవా నడుస్తోంది. అయితే ఇకపై ఇలాంటి ఆటలు సాగవు!. అశ్లీల కంటెంట్‌తో పాటు మార్ఫింగ్‌ వీడియోల తొలగింపు కోసం స్వయంగా రంగంలోకి దిగింది కేంద్రం.  


ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అశ్లీల,  మార్ఫింగ్‌ వీడియోల పని పట్టేలో కేంద్ర ప్రభుత్వం తలమునకలైంది. వివిధ ప్లాట్‌ఫామ్‌లలోని అకౌంట్లపై వేట(టు) మొదలైంది. ఈ మేరకు కేంద్ర సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ.. ట్విటర్‌, ఫేస్‌బుక్‌​, టెలిగ్రాం అకౌంట్‌లలో సర్క్యులేట్‌ అవుతున్న మార్ఫింగ్‌, అశ్లీల వీడియోల అంశాన్ని ఆయా ప్లాట్‌ఫామ్స్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయా అకౌంట్లను తాత్కాలికంగా లేదంటే పూర్తిగా నిషేధించడమో చేయాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడుతున్నాయి కూడా.  

ఆ క్లిప్‌తో గుర్రు!
గతంలో పోర్న్‌ సైట్ల బహిరంగ వీక్షణపై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెలికామ్‌ ఆపరేటర్ల సహకారంతో ఈ చర్యకు ఉపక్రమించింది. అయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా అశ్లీల కంటెంట్‌ వైరల్‌ అవుతూ వస్తుండగా..  ఎప్పటికప్పుడు చర్యల ద్వారా కట్టడి చేస్తూ వస్తోంది కేంద్రం. ఇదిలా ఉంటే  ట్విటర్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో సైతం అసభ్య, అశ్లీల, మార్ఫింగ్‌, ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవుతూ వస్తున్నాయి. ఈ విషయంలో పలు ఫిర్యాదులు అందడంతో సీరియస్‌ అయిన కేంద్రం.. ఐటీ రూల్స్ 2021 ద్వారా కట్టడికి ప్రయత్నిస్తూ వస్తోంది. అయినా కూడా కంటెంట్‌ వ్యాప్తి ఆగడం లేదు. కేవలం ఏజ్‌ లిమిట్‌ పర్మిషన్‌తో యూజర్లను ఆయా ప్లాట్‌ఫామ్స్‌ అనుమతిస్తుండగా.. కేంద్రం మాత్రం ఇది కుదరని కరాకండిగా చెప్తోంది. ఇంతలో క్యాబినేట్‌ భేటీ సంబంధిత క్లిప్‌ మార్ఫింగ్‌ అయ్యి మరి సర్క్యులేట్‌ అవుతుండడంపై కేంద్రం గరం అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

 

ఫటాఫట్‌ చర్యలు
ప్రత్యేకించి కొన్ని అకౌంట్లు, పేజీలు, ఛానెల్స్‌ నుంచే అశ్లీల కంటెంట్‌, వర్గాల మధ్య చిచ్చు పెట్టే తరహా కంటెంట్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ మేరకు ఆయా ప్లాట్‌ఫామ్స్‌ నుంచి సరైన స్పందన లేకపోతుండడంతో స్వయంగా సమాచార మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరగతిన రంగంలోకి దిగిన కేంద్రం..  73 ట్విటర్‌ అకౌంట్లను సస్పెండ్‌ చేసింది.  నాలుగు యూట్యూబ్‌ ఛానెళ్లను తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌ గేమ్‌ను తొలగించిందని తెలుస్తోంది. కేవలం తొలగించడమే కాదు.. ఇలాంటి చేష్టలకు పాల్పడే బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని చెబుతోంది కేంద్రం. 

ఆడవాళ్ల కోసం.. 
మరోవైపు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఇతరత్ర కంటెంట్‌ను వ్యాప్తిచెందిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ మేరకు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, టెలిగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌లకు అలాంటి అకౌంట్ల విషయంలో జాప్యం చేయకుండా(విచారణ, దర్యాప్తు పేరుతో కాలయాపన చేయకుండా) త్వరగతిన యాక్షన్‌ తీసుకోవాలని సూచించింది. ప్రత్యేకించి ప్రముఖుల మార్ఫింగ్‌, అభ్యంతరకర, నకిలీ కంటెంట్‌ విషయంలో త్వరగతిన స్పందించాలని కోరింది. ఫిర్యాదులు అందినా.. అందకపోయినా నిరంతర పర్యవేక్షణ ద్వారా చర్యలకు ఉపక్రమించాలని తెలిపింది. టెక్నాలజీ(ఫేక్‌, మార్ఫింగ్‌) కట్టడికి టెక్నాలజీనే విరుగుడుగా ఉపయోగించాలని సూచిస్తోంది. 

వీపీఎన్‌ల నిషేధం!
ట్విటర్‌, టెలిగ్రామ్‌ లాంటి అకౌంట్‌లతో పాటు వీపీఎన్‌(వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్)లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా అశ్లీల, అభ్యంతరకర, నిషేధిత కంటెంట్‌ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీపీఎన్‌ అకౌంట్ల నిషేధంపై కేంద్రం నజర్‌ పెట్టింది. ప్రత్యేక టూల్స్‌ ద్వారా అకౌంట్లపై నిఘా కొనసాగించాలంటూ ఆయా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఒత్తిడి తెస్తోంది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని  ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఇది వరకే హోం మంత్రిత్వ శాఖను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు అశ్లీల సైట్ల డొమైన్‌ల(ఎప్పటికప్పుడు మారుస్తూ ఇంటర్నెట్‌లో దర్శనమివ్వడం!) విషయంలోనూ కఠిన నియంత్రణ ద్వారా కట్టడి చేయాలని అనుకుంటోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే..  ఈ వేసవి లోపే అశ్లీల, మార్ఫింగ్‌ వీడియోల కట్టడిపై కేంద్రం పట్టు సాధించే అవకాశం ఉంది.

చదవండి: 20 ఏళ్లుగా పరారీలో డాన్‌.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు

మరిన్ని వార్తలు