లక్ష కోట్లు దాటుతోంది.. ఇంకా లైట్‌ తీసుకుంటే ఎలా ?

22 Mar, 2022 10:13 IST|Sakshi

లక్ష కోట్లకు ప్రకటనల రంగం 2024 నాటికి ఆదాయ అంచనా: ఈవై–ఫిక్కీ   

న్యూఢిల్లీ: టీవీ, న్యూస్‌పేపర్‌, వెబ్‌సైట్‌, వీడియో కంటెంట్‌ సైట్‌ ఏదైనా సరే అడ్వెర్‌టైజ్‌మెంట్‌ కనిపించిందంటే చాలు వెంటనే ఛానల్‌ మార్చడంతో, పేపర్‌ తిప్పడంలో స్కిప్‌ బటన్‌ నొక్కడమో చేస్తాం. జనాలు పెద్దగా యాడ్స్‌పై దృష్టి పెట్టకున్నా ప్రకటనల విభాగం మాత్రం ఊహించని స్థాయి వృద్ధి కనబరుస్తోంది. మరో రెండేళ్లలో లక్ష కోట్ల మార్క్‌ను దాటేయనుంది.

లక్ష కోట్లు
ప్రకటనల రంగం దేశంలో 2024 నాటికి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని ఈవై–ఫిక్కీ నివేదిక వెల్లడించింది. వార్షిక వృద్ధి 12 శాతం నమోదవుతుందని తెలిపింది. ‘ప్రకటనల రంగ ఆదాయం 2019లో రూ.79,500 కోట్లు. పరిశ్రమ 2020లో 29 శాతం తిరోగమనం చెందింది. కోవిడ్‌–19 ఆటంకాలు ఉన్నప్పటికీ ఈ రంగం తిరిగి పుంజుకుని 2021లో ఆదాయం 25 శాతం అధికమై రూ.74,600 కోట్లను దక్కించుకుంది. ఈ ఏడాది 16 శాతం వృద్ధితో రూ.86,500 కోట్లకు చేరనుంది. 

ఆ రెండు కలిపితే
భారత మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం గతేడాది 16.4 శాతం పెరిగి రూ.1.61 లక్షల కోట్లు నమోదు చేసింది. ఈ ఏడాది 17 శాతం వృద్ధితో రూ.1.89 లక్షల కోట్లను తాకి మహమ్మారి ముందు స్థాయికి చేరుకుంటుంది. 2024 నాటికి ఏటా 11 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లు నమోదు చేస్తుంది. 

నంబర్‌ వన్‌ టీవీనే
టెలివిజన్‌ అతిపెద్ద సెగ్మెంట్‌గా మిగిలిపోయినప్పటికీ డిజిటల్‌ మీడియా బలమైన నంబర్‌–2గా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముద్రణ విభాగం పుంజుకుని మూడవ స్థానంలో నిలిచింది. డిజిటల్‌ మీడియా వాటా 2019లో 16 శాతం కాగా, గతేడాది 19 శాతానికి ఎగబాకింది. మీడియా, వినోద రంగంలో టీవీ, ప్రింట్, చిత్రీకరించిన వినోదం, ఔట్‌డోర్‌ ప్రకటనలు, సంగీతం, రేడియో వాటా 68 శాతముంది. 2019లో ఇది 75 శాతం నమోదైంది. సినిమా థియేటర్లలో ప్రకటనలు, టీవీ చందాలు మినహా మీడియా, వినోద పరిశ్రమలో 2021లో అన్ని విభాగాల ఆదాయాలు పెరిగాయి.  
 

మరిన్ని వార్తలు