ఫాంగ్‌ స్టాక్స్‌ జోరు- నాస్‌డాక్‌ 35వ రికార్డ్‌

21 Aug, 2020 10:00 IST|Sakshi

మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, నెట్‌ఫ్లిక్స్‌ అప్‌

2 ట్రిలియన్‌ డాలర్లు దాటిన యాపిల్‌ విలువ 

2000 డాలర్లు తాకిన టెస్లా ఇంక్‌ షేరు

ప్రధానంగా ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే దిగ్గజాలు జోరందుకోవడంతో గురువారం నాస్‌డాక్‌ సరికొత్త ఫీట్‌ సాధించింది. 118 పాయింట్లు (1.1 శాతం) ఎగసి 11,265 వద్ద ముగిసింది. తద్వారా 2020లో 35వ సారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 11 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 3,385 వద్ద నిలిచింది. ఇక డోజోన్స్‌ 47 పాయింట్లు(0.2 శాతం) బలపడి 27,740 వద్ద స్థిరపడింది. కాగా. 2020లో నాస్‌డాక్‌ 25.5 శాతం జంప్‌చేయగా.. ఎస్‌అండ్‌పీ 5 శాతం ఎగసింది. డోజోన్స్‌ మాత్రం 3 శాతం క్షీణించింది. టెక్‌ దిగ్గజాల అండతో 2019లో నాస్‌డాక్‌ 31సార్లు రికార్డ్‌ గరిష్టాలను అందుకోగా.. 2018లోనూ 29సార్లు ఈ ఫీట్‌ను సాధించడం విశేషం!

తొలి అమెరికన్‌ కంపెనీ
గురువారం ట్రేడింగ్‌లో యాపిల్‌ షేరు 2.2 శాతం లాభపడి 473 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2 లక్షల కోట్ల డాలర్లను అధిగమించి నిలిచింది. బుధవారం ఇంట్రాడేలో ఈ ఫీట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. వెరసి అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో యాపిల్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాగా.. ఇతర దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ సైతం గురువారం 2.5 శాతం స్థాయిలో ఎగశాయి. దీంతో నాస్‌డాక్‌కు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్‌ షేరు 6.6 శాతం దూసుకెళ్లింది. 2002 డాలర్ల సమీపంలో నిలిచింది. వెరసి తొలిసారి 2,000 డాలర్ల మార్క్‌ను చేరింది. ఇతర కౌంటర్లలో ట్యాక్సీ సేవల కంపెనీలు ఉబర్‌ 7 శాతం, లిఫ్ట్‌ 6 శాతం చొప్పున జంప్‌చేశాయి. 

మరిన్ని వార్తలు