కంపెనీల ఐపీవోకి సెబీ గ్రీన్‌ సిగ్నల్‌, టార్గెట్‌ రూ.7వేల కోట్లు!

3 May, 2022 08:55 IST|Sakshi

న్యూఢిల్లీ: లైఫ్‌స్టయిల్‌ రిటైల్‌ బ్రాండ్‌ ఫ్యాబ్‌ఇండియా, స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీ ఏథర్‌ ఇండస్ట్రీస్‌ సహా మొత్తం ఏడు కంపెనీల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్లకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ, ఏషియానెట్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్, సనాతన్‌ టెక్స్‌టైల్స్, క్యాపిలరీ టెక్నలజీస్‌ ఇండియా, హర్ష ఇంజినీర్స్‌ ఇంటర్నేషనల్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 

ఈ సంస్థలు దాదాపు రూ. 9,865 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇవి గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో దరఖాస్తు చేసుకున్నాయి. ఏప్రిల్‌ 27–30 మధ్యలో సెబీ అనుమతులు మంజూరు చేసింది.  

ముసాయిదా ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ఫ్యాబ్‌ఇండియా .. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల వరకూ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.5 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించనుంది. ఈ ఇష్యూ సుమారు రూ. 4,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అటు ఏథర్‌ ఇండస్ట్రీస్‌ ఆఫర్‌ ప్రకారం రూ. 757 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో 27.51 లక్షల షేర్లను విక్రయించనుంది. మొత్తం మీద రూ. 1,000 కోట్ల వరకూ సమీకరించవచ్చని తెలుస్తోంది.  

మిగతా సంస్థలు.. 

ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఏషియానెట్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ రూ. 765 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, హాథ్‌వే ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ రూ. 465 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్‌ఎస్‌ కింద విక్రయించనుంది. 

ఎలక్ట్రానిక్స్‌ తయారీ సర్వీసుల సంస్థ సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌ దాదాపు రూ. 1,000–1,200 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. రూ. 926 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్‌ వీణా కుమారి టాండన్‌ 33.69 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించనున్నారు. 

► యార్న్‌ తయారీ సంస్థ సనాతన్‌ టెక్స్‌టైల్స్‌ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,200–1,300 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల మేర కొత్త షేర్లు, ఓఎఫ్‌ఎస్‌ కింద 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సొల్యూష న్స్‌ అందించే క్యాపిలరీ టెక్నాలజీస్‌ .. ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమకూర్చుకోనుంది. పబ్లిక్‌ ఇష్యూ కింద తాజాగా రూ. 200 కోట్ల విలువ చేసే షేర్లు, అలాగే ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ. 650 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. 

హర్ష ఇంజినీర్స్‌ ఇంటర్నేషనల్‌ రూ. 750 కోట్లు సమీకరిస్తోంది. రూ. 455 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుత షేర్‌హోల్డర్లు రూ. 300 కోట్ల షేర్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించనున్నారు.    

మరిన్ని వార్తలు