కెమరాతో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లపై గూఢచర్యం

18 Sep, 2020 13:26 IST|Sakshi

వాషింగ్టన్‌: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై మరో కేసు నమోదయ్యింది. మొబైల్‌లోని కెమరాను అనధికారికంగా ఉపయోగించడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులపై గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలతో కేసు నమోదయ్యింది. ఐఫోన్‌లోని ఫోటో షేరింగ్‌ యాప్‌ కెమెరాను వినియోగించని సమయంలో కూడా యాక్సెస్ చేస్తున్నట్లు జూలైలో మీడియా నివేదికలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఈ దావా నమోదయ్యింది. అయితే ఫేస్‌బుక్ ఈ నివేదికలను ఖండించింది.. దాన్ని ఒక బగ్‌గా వర్ణించింది.. సరి చేస్తున్నామని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ ఐఫోన్ కెమెరాలను యాక్సెస్ చేస్తోందనే వార్తలను తప్పుడు నోటిఫికేషన్లుగా అభివర్ణించింది. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని ఫెడరల్ కోర్టులో గురువారం దాఖలు చేసిన ఫిర్యాదులో, న్యూజెర్సీ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ బ్రిటనీ కొండిటి కెమెరా యాప్‌ ఉపయోగం ఉద్దేశపూర్వకంగా ఉందని.. దానితో వినియోగదారుల “లాభదాయకమైన, విలువైన డాటాను సేకరించే ఉద్దేశ్యంతో ఇది పని చేస్తుంది’’ అని వాదించారు. (చదవండి: ఫేస్‌బుక్ ఇండియా ఎండీకి నోటీసులు)

ఫిర్యాదు ప్రకారం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారుల ప్రైవేట్, సన్నిహిత వ్యక్తిగత డాటాను పొందడంతో సహా విలువైన ఇన్‌సైట్స్‌, మార్కెట్ పరిశోధనలను సేకరించగలవని వెల్లడించారు. అయితే దీనిపై స్పందించడానికి ఫేస్‌బుక్‌ నిరాకరించింది. గత నెలలో దాఖలు చేసిన ఒక దావాలో, ఫేస్‌బుక్ తన 100 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల బయోమెట్రిక్ డాటాను చట్టవిరుద్ధంగా పొందడానికి ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీని ఉపయోగించారని ఆరోపించారు. ఫేస్‌బుక్ ఈ వాదనను ఖండించింది. ఇన్‌స్టాగ్రామ్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించదని తెలిపింది. 

మరిన్ని వార్తలు