తాలిబన్ల దురాగతాలు.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ అలర్ట్‌! ఆ వీడియోలకు నోట్‌ తప్పనిసరి

17 Aug, 2021 11:13 IST|Sakshi
2014లో లండన్‌ వీధుల్లోని ఓ నాటక దృశ్యం.. ఇప్పుడు తాలిబన్‌ వీడియోగా వైరల్‌

అఫ్గన్‌ నేల మీద మొదలైన తాలిబన్ల ఆరాచకాలు.. చాలా మీడియా, సోషల్‌ మీడియా హౌజ్‌లలో ఇప్పుడు ఇదే శీర్షిక వార్త. బుర్ఖాలో ఉన్న కొందరు ఆడవాళ్లను.. నడిరోడ్డు మీద వేలం వేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో  తాలిబన్‌ పేరిట విపరీతంగా సర్క్యులేట్‌ అవుతోంది. కానీ, ఇది ఇప్పటి వీడియో కాదు. 2014లోది. పైగా అది యాక్టింగ్‌ వీడియో. కుర్షీద్‌ యాక్టివిస్టులు.. ఇరాక్‌లో ఐసిస్‌ దురాగతాలను లండన్‌ వీధిలో ఇలా ప్రదర్శన చేసి చూపించారు. ఇలా తాలిబన్‌ ఆరాచకాల పేరుతో ఫేక్‌ ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతుండడంపై సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అప్రమత్తం అయ్యాయి.

అప్గన్‌, అప్ఘనిస్థాన్‌, తాలిబన్‌.. ఇప్పుడు ఈ పరిణామాలే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఓవైపు ఫేక్‌ ఫొటోలు, వీడియోలు, తాలిబన్ల ఆరాచకాలు పాత ఘటనలతో పాటు మరోవైపు ఆ దేశంలోని తాజా పరిస్థితులకు సంబంధించిన కంటెంట్‌ తెర మీదకు వస్తోంది. దీంతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు పెద్ద తలనొప్పి మొదలైంది. ఫేక్‌, ఓల్డ్‌ కంటెంట్‌తో పాటు తాజా అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు.. హింసాత్మక వీడియోలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అలాంటి కంటెంట్‌ను వైరల్‌ చేసే అకౌంట్లపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.

ఫేస్‌బుక్‌-ఇన్‌స్టా
ఫేక్‌, పాతతో పాటు అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించే పనిని మొదలుపెట్టినట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించుకుంది. తాలిబన్‌ నిషేధిత జాబితాలో ఉండడం, ఆ గ్రూప్‌ ప్రమోట్‌ చేసే కంటెంట్‌ కట్టడికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. మరోవైపు అఫ్గన్‌ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. రెచ్చగొట్టే, అభ్యంతరకర ఫొటో స్టోరీలను సైతం అనుమతించబోమని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌​ మోస్సెరి స్పష్టం చేశారు. ఫేస్‌బుక్‌ కూడా ఇదే రీతిలో కంటెంట్‌ కట్టడి ప్రయత్నించనుందని ఫేస్‌బుక్‌ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

చర్యలు తీసుకుంటాం: ట్విటర్‌
ఇక ట్విటర్‌లో కంటెంట్‌కు హద్దులు లేకపోవడంతో అభ్యంతర కంటెంట్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది. తుపాకుల కాల్పుల మోత దగ్గరి నుంచి విమానాశ్రయం కాల్పుల ఘటన, విమానాల్లోంచి కింద పడిన వీడియోలు, తాలిబన్ల స్వేచ్ఛా విహారం, దురాగతాలకు సంబంధించిన కంటెంట్‌ ఎక్కువగా ట్విటర్‌ ద్వారానే వ్యాప్తి చెందుతోంది. ఈ విమర్శల నేపథ్యంలో చర్యలు మొదలుపెట్టినట్లు ట్విటర్‌ తెలిపింది. మరోవైపు గూగుల్‌ అఫ్గన్‌ సంబంధిత కంటెంట్‌ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

హాట్‌ న్యూస్‌: తాలిబన్‌ ఎఫెక్ట్‌: ఎగుమతుల సంగతి ఏంటంటే..

వార్నింగ్‌ తప్పనిసరి
కాబూల్‌ విమానాశ్రయంలో తుపాకుల మోతల నడుమ ఉరుకులు పరుగులు, రన్‌వేపై టైరుకు వేలాడిన జనం, ఆకాశం నుంచి పిట్టల్లా రాలిన జనం వీడియో.. నిన్నంతా విపరీతంగా వైరల్‌ అయ్యాయి. అయితే యూట్యూబ్‌ సహా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఆఖరికి టిక్‌టాక్‌ లాంటి వీడియో జనరేటింగ్‌ యాప్‌లు కూడా వయొలెంట్‌ లేదా గ్రాఫిక్‌ కంటెంట్‌ వార్నింగ్‌ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని నిర్ణయించాయి. మరోవైపు యూట్యూబ్‌ కూడా వయసు పరిమితి (ఏజ్‌ రిస్రి‍్టక్షన్‌ నోట్‌) ద్వారా వీడియోలను ప్రదర్శించొచ్చని, కానీ, హింసాత్మకంగా ఉండే కంటెంట్‌ను మాత్రం ప్రొత్సహించబోమని స్పష్టం చేశాయి. న్యూస్‌ ఛానెల్స్‌ కూడా వార్నింగ్‌ నోట్‌ (video may be inappropriate for some users) ఇవ్వాలని,  లేకుంటే వీడియోను తొలగించాల్సి వస్తుందని యూట్యూబ్‌ హెచ్చరించింది.
 

తాలిబన్ల సంగతి!
ప్రస్తుతం తాలిబన్లు సోషల్‌ మీడియాను విపరీతంగా వాడేసుకుంటున్నారు. తాలిబన్‌ పెద్దతలలు కూడా ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా అప్‌డేట్‌లు ఇస్తుండడం చూస్తున్నాం. అయితే వాళ్ల అకౌంట్‌లపై నిషేధం, అప్‌డేట్లపై లాక్‌ గురించి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో అఫ్గన్‌ ప్రజల సోషల్‌ మీడియా వాడకంపై తాలిబన్ల ఆంక్షలు విపరీతమైన ప్రభావం చూపెట్టే అకాశం ఉందని అట్లాంటిక్‌ కౌన్సిల్‌ రచయిత ఎమర్‌సెన్‌ బ్రూకింగ్‌ అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు