100 కోట్ల యూజర్లకు షాకిచ్చిన ఫేస్‌బుక్‌..ఇకపై..

3 Nov, 2021 12:19 IST|Sakshi

గత కొంత కాలంగా ఏదో ఓ రూపంలో ఫేస్‌బుక్‌ సంస్థ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ  సోష‌ల్ మీడియా దిగ్గజం ఫేస్ రిక‌గ్నిష‌న్ సిస్ట‌మ్‌ను ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విషయాన్ని మంగ‌ళ‌వారం ఎఫ్‌బీ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి తన బ్లాగులో పోస్ట్‌ చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ వాడుతున్న సుమారు వంద కోట్ల మంది యూజ‌ర్ల ఫేషియ‌ల్ డేటాను కూడా డిలీట్ చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఈ ఆప్షన్‌పై ప్ర‌భుత్వం కూడా స్పష్టమైన నిబంధనలను రూపొందించ‌లేక‌పోతున్న‌ట్లు ఆయన తెలిపారు. ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు కంటే ప్రమాదాలే ఎక్కువని సోషల్‌మీడియాలో పెరుగుతున్న ఆందోళనలు, రెగ్యులేట‌రీ కార‌ణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు  ఎఫ్‌బీ వెల్లడించింది. కాగా ఫేస్‌బుక్‌ వాడుతున్న యూజ‌ర్ల‌లో మూడ‌వ వంతు మంది ఈ టెక్నాలజీని వాడుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు.

ఓ వైపు సరైన అనుమతి లేకుండా వినియోగదారుల బయోమెట్రిక్ డేటాను సేకరించి, నిల్వ చేసిందనే ఆరోపణలు, మరో వైపు వినియోగదారుల భద్రత, దాని ప్లాట్‌ఫారమ్‌లలో అనేక రకాల దుర్వినియోగాలపై చట్టసభలలో దీనిపై తీవ్రమైన ఆరోపణలు పరిశీలనలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

చదవండి: ఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే ఇవి తప్పనిసరి.. అమల్లోకి కొత్త రూల్స్‌

మరిన్ని వార్తలు