తొలిసారి 100 బిలియన్‌ డాలర్లకు సంపద

7 Aug, 2020 14:32 IST|Sakshi

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ నెట్‌వర్త్‌ ఇది

100 బిలియన్‌ డాలర్ల కుబేరుల జాబితాలో చోటు

'రీల్స్‌'ను ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్‌- షేరు హై'జంప్‌

షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ రీల్స్‌తో టిక్‌టాక్‌కు చెక్‌ 

షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ రీల్స్‌(Reels)ను యూఎస్‌ మార్కెట్లో ప్రవేశపెట్టడంతో గురువారం సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ షేరు జోరందుకుంది. ఏకంగా 6.5 శాతం జంప్‌చేసింది. 265 డాలర్ల ఎగువన ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. దీంతో ఫేస్‌బుక్‌లో 13 శాతం వాటా కలిగిన మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యక్తిగత సంపద తొలిసారి 100 బిలియన్‌ డాలర్లను తాకింది. వెరసి 100 బిలియన్‌ డాలర్లకుపైగా సంపద కలిగిన ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్‌ బెజోస్‌(అమెజాన్‌), బిల్‌గేట్స్‌(మైక్రోసాఫ్ట్‌) సరసన నిలిచారు.

టిక్‌టాక్‌కు చెక్‌
ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్‌ అయిన చైనీస్‌ యాప్‌ టిక్‌టాక్‌కు చెక్‌ పెడుతూ షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ రీల్స్‌ను ఫేస్‌బుక్‌ బుధవారం యూఎస్‌ మార్కెట్లో విడుదల చేసింది. దీంతో గురువారం షేరు దూసుకెళ్లింది. కాగా.. ఈ ఏడాది అమెరికా స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. గురువారం యూఎస్‌ మార్కెట్లలో తొలిసారి నాస్‌డాక్‌ 11,000 పాయింట్ల మార్క్‌ను దాటి ముగిసింది. ఇందుకు టెక్‌ దిగ్గజాలు దన్నుగా నిలుస్తున్నాయి. 

జోరు తీరిలా
ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌, ఆటో టెక్నాలజీ కంపెనీ టెస్లా తదితరాలు ఈ ఏడాది(2020) అనూహ్య ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. దీంతో 2020లో ఇప్పటివరకూ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపద 75 బిలియన్‌ డాలర్లకుపైగా ఎగసింది. ఈ బాటలో జుకర్‌బర్గ్‌ సంపద సైతం 22 బిలియన్‌ డాలర్లమేర బలపడింది. తద్వారా ఎలైట్‌ క్లబ్‌లో జుకర్‌బర్గ్‌ చోటు సాధించారు. కాగా.. ఇదే విధంగా దేశీ పారిశ్రామిక దిగ్గజం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద సైతం 22 బిలియన్‌ డాలర్లమేర పుంజుకోవడం గమనార్హం! దీంతో ముకేశ్‌ సంపద 80 బిలియన్‌ డాలర్లను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా డిజిటల్‌, టెలికం విభాగం రిలయన్స్‌ జియోలోకి విదేశీ పెట్టుబడులు భారీగా ప్రవహించడం కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు