‘మీరు వెళ్లండి, కానీ మేం నష్టపోనివ్వకుండా చూడండి’

14 Sep, 2022 07:30 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశీ ఆటోమొబైల్‌ సంస్థలు (ఓఈఎం) అకస్మాత్తుగా భారత మార్కెట్‌ నుంచి నిష్క్రమిస్తుండటం వల్ల తాము భారీగా నష్టపోవాల్సి వస్తోందని ఆటోమొబైల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిష్క్రమణల వల్ల తమను నష్టపోనివ్వకుండా తగు పరిహారం అందేలా చూడాలని కోరారు. రెండు పక్షాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు ఉండాలని ఆటోమోటివ్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఆటో రిటైల్‌ సదస్సులో నమూనా డీలర్‌ ఒప్పందాన్ని (ఎండీఏ) ఆవిష్కరించింది.

‘ఓఈఎం (వాహనాల తయారీ సంస్థలు)లకు, డీలర్లకు మధ్య ప్రస్తుతం ఒప్పందాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. అవి ఓఈఎంల కోణంలోనే ఉంటున్నాయి. అలాకాకుండా వ్యాపార నిర్వహణలో మా మాటకు కూడా విలువ ఉండేలా ఒప్పందాలు ఉండాలన్నది డీలర్ల అభిప్రాయం‘ అని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ మనీష్‌ రాజ్‌ సింఘానియా చెప్పారు. ఎండీఏతో ఇటు ఓఈఎంలు, అటు డీలర్లకు సమాన స్థాయి లభించగలదని పేర్కొన్నారు. ఒప్పందాలనేవి ఆటో పరిశ్రమ లేదా వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా ఇరు పక్షాలకు తగు పరిహారం లేదా తగిన సెటిల్మెంట్‌ లభించేలా ఉండాలే తప్ప ఏకపక్షంగా ఉండకూడదని సింఘానియా చెప్పారు.  

విదేశీ ఓఈఎంలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం కోసం అయిదేళ్ల పైగా కూడా అధ్యయనాలు చేస్తుంటాయని, కానీ తప్పుకోవాల్సి వస్తే హఠాత్తుగా నిష్క్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘దీంతో డీలర్ల దగ్గర వాహనాలు, స్పేర్‌ పార్టుల స్టాక్‌లు పేరుకుపోతుంటాయి. వ్యాపారం కోసం మేము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. విదేశీ ఓఈఎం అకస్మాత్తుగా నిష్క్రమించడం వల్ల ఆ డబ్బంతా ఇరుక్కుపోతుంది. అలా కాకుండా ఒకవేళ నిష్క్రమించాల్సి వస్తే అది ప్రణాళికాబద్ధంగా జరిగితే, డీలర్లు కూడా తమ దగ్గరున్న నిల్వలను విక్రయించి, బ్యాంకు రుణాలను తీర్చుకునేందుకు వీలవుతుంది‘ అని సింఘానియా చెప్పారు. 2017లో జనరల్‌ మోటర్స్, 2021లో ఫోర్డ్‌ భారత మార్కెట్‌ నుంచి నిష్క్రమించిన సందర్భాల్లో డీలర్లు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు