థామస్‌ కుక్‌లో ప్రమోటర్‌ వాటా అప్‌

22 Jun, 2022 06:11 IST|Sakshi

72.34 శాతానికి ఫెయిర్‌బ్రిడ్జ్‌ వాటా

ముంబై: ప్రమోటర్‌ సంస్థలలో ఒకటైన ఫెయిర్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌(మారిషస్‌).. తాజాగా వాటాను పెంచుకున్నట్లు ఓమ్ని చానల్‌ ట్రావెల్‌ కంపెనీ థామస్‌ కుక్‌ (ఇండియా) పేర్కొంది. దీంతో ఫెయిర్‌బ్రిడ్జ్‌ వాటా 70.58 శాతం నుంచి 72.34 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. మిగిలిపోయిన దాదాపు రూ. 133 కోట్ల విలువైన ఐచ్చిక మార్పిడికి వీలు కల్పించే క్యుమిలేటివ్‌ రీడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లకు బోర్డు సబ్‌కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది.

తద్వారా 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఫెయిర్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ తాజాగా పొందినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 47.3 ధరలో మొత్తం రూ. 436 కోట్ల విలువైన రీడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు 9.2 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పు చెందినట్లు వెల్లడించింది. వెరసి ప్రమోటర్ల వాటా 72.34 శాతానికి చేరినట్లు వివరించింది. ట్రావెల్, తత్సంబంధ సర్వీసుల విభాగాలలో కనిపిస్తున్న వేగవంత వృద్ధిపట్ల ప్రమోటర్లకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిఫలిస్తున్నట్లు థామస్‌ కుక్‌ (ఇండియా) ఎండీ మాధవన్‌ మీనన్‌ పేర్కొన్నారు.

ఈ వార్తల నేపథ్యంలో థామస్‌ కుక్‌(ఇండియా) షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 56 దిగువన ముగిసింది.

మరిన్ని వార్తలు