ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌కు గుడ్‌బై!

10 Mar, 2022 06:00 IST|Sakshi

విదేశీ సంస్థల సన్నాహాల

వాటా విక్రయ ప్రణాళికలు

భారీ ప్రీమియంపై కన్ను

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ అండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో వాటాలను విక్రయించాలని విదేశీ పెట్టుబడి సంస్థలు యోచిస్తున్నాయి. ప్రధానంగా జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్, ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ వాటాలను ఆఫర్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌లో ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌కు 13.6 శాతం వాటా ఉంది. అయితే మార్కెట్‌ ధర కంటే అధికంగా సుమారు 40 శాతంవరకూ ప్రీమియంను ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ వాటాల కొనుగోలుకి పీఈ ఫండ్స్, సంపన్న వర్గాలు (హెచ్‌ఎన్‌ఐలు) ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నాయి. పీఈ సంస్థ ద క్యాపిటల్‌ ఫండ్‌ సైతం రేసులో ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో షేరుకి రూ. 2,100 ధరవరకూ ఆశిస్తున్నట్లు వెల్లడించాయి. బుధవారం బీఎస్‌ఈలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ షేరు స్వల్ప లాభంతో రూ. 1,474 వద్ద ముగిసింది. కాగా.. వాటా విక్రయం అంశంపై ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌సహా జనరల్‌ అట్లాంటిక్, ఫెయిర్‌ఫాక్స్‌ స్పందించకపోవడం గమనార్హం!  

2008లో షురూ
కొటక్‌ వెల్త్‌ ఉద్యోగులు కరణ్‌ భగత్, యతిన్‌ షా సహకారంతో 2008లో నిర్మల్‌ జైన్‌ ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ను ఏర్పాటు చేశారు. 2015 అక్టోబర్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ ఫండ్‌ 21.6 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 1,122 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. అయితే అప్పటికి ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ పేరుతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2019లో విలువ జోడింపునకు వీలుగా ఐఐఎఫ్‌ఎల్‌.. ఫైనాన్స్, వెల్త్, సెక్యూరిటీస్‌ పేరుతో మూడు కంపెనీలుగా విడదీసి లిస్టింగ్‌ చేసింది. కాగా.. 44 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో దేశంలోనే అతిపెద్ద స్వతంత్ర వెల్త్‌ మేనేజర్‌ కంపెనీగా ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ నిలుస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు