గ్రామాల్లో కొనుగోళ్లు.. గంపెడాశలు పెట్టుకున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు!

10 Apr, 2023 07:43 IST|Sakshi

 న్యూఢిల్లీ: కమోడిటీ ద్రవ్యోల్బణం చల్లబడడం ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వినియోగానికి అనుకూలమని కంపెనీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన ఐదారు త్రైమాసికాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పడిపోగా, తిరిగి అది పుంజుకుంటుందన్న అంచనాతో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో ఉన్నాయి. మార్జిన్లు మార్చి త్రైమాసికంలో పెరుగుతాయని గోద్రేజ్‌ కన్జన్యూమర్‌ ప్రొడక్ట్స్‌ (జీసీపీఎల్‌) సైతం అంచనాతో ఉంది. 

‘‘మార్చి త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ రంగం క్రమంగా రికవరీని చూసింది. వార్షికంగా చూస్తే అమ్మకాల పరిమాణం పెరిగింది. పట్టణాల్లో, ప్రీమియం ఉత్పత్తుల విభాగాల్లో అమ్మకాలు స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం చల్లబడడం మొత్తం మీద వినియోగానికి, గ్రామీణ మార్కెట్లకు అనుకూలం’’అని మారికో తెలిపింది. కొబ్బరి ధరలు స్థిరంగా, సానుకూల శ్రేణిలోనే ఉండగా, వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థూల మార్జిన్లు పెరుగుతాయని, వార్షికంగా చూస్తే ఆపరేటింగ్‌ మార్జిన్‌లో సహేతుకమైన వృద్ధి ఉంటుందని మారికో తెలిపింది. ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు పూర్తి స్థాయిలో కోలుకోకపోయినా, త్రైమాసికం వారీగా చూస్తే మార్చిలో పుంజుకున్నట్టు డాబర్‌ పేర్కొంది. 

పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు తిరిగి సానుకూల ధోరణికి చేరాయని, గ్రామీణ మార్కెట్లలోనే ఇంకా సాధారణ స్థితికి చేరుకోవాల్సి ఉందని తెలిపింది. సమీప కాలంలో వినియోగంపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, వినియోగదారుల్లో విశ్వాసం పెరగడం, ప్రభుత్వ వినియోగం పెరగడం అనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నట్టు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. అధిక శాతం కమోడిటీల ధరలు గరిష్ట స్థాయి నుంచి దిగి రావడంతో, స్థూల మార్జిన్లను మెరుగుపడతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.  

ఒక అంకె వృద్ధి.. 
డాబర్‌ దేశీయ, అంతర్జాతీయ వ్యాపారం 5–6 శాతం స్థాయిలో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. దేశీ మార్కెట్లో వినియోగ డిమాండ్‌ ధోరణలు మార్చి త్రైమాసికంలో నిలకడగా ఉన్నాయని, ఎఫ్‌ఎంసీజీ రంగం నిలకడైన వృద్ధిని చూస్తుందని సీజీపీఎల్‌ చెబుతోంది. మొత్తం మీద వృద్ధి అనేది అన్ని విభాగాల్లోనూ ఉంటుందని, హోమ్‌కేర్, పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తుల్లో అమ్మకాలు, ఆదాయం పరంగా రెండంకెల వృద్ధిని చూస్తామని అంచనా వేస్తోంది. భారత్‌ తర్వాత గోద్రేజ్‌ కన్జ్యూమర్‌కు ఇండోనేషియా రెండో అతిపెద్ద మార్కెట్‌ కాగా, కన్సాలిడేటెడ్‌ స్థాయిలో రెండంకెల వృద్ధిపై కంపెనీ అంచనాలతో ఉంది.

 ‘‘మా ఉత్పత్తుల నాణ్యతలో పురోగతి ఉంది. మార్కెటింగ్‌పై అదే పనిగా పెట్టుబడులు పెడుతుండడం వల్ల, స్థూల మార్జిన్లు కోలుకుంటాయి. దీంత ఎబిట్డాలో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’’అని జీసీపీఎల్‌ తెలిపింది. వర్షాల సీజన్‌ సానుకూలంగా ఉండడం రానున్న త్రైమాసికాల్లో వృద్ధికి కీలకమని పరిశ్రమ భావిస్తోంది.

‘‘బ్రాండ్లు, ఆవిష్కరణలపై బలంగా పెట్టుబడులు పెడుతున్నాం. పంపిణీని విస్తరిస్తున్నాం. తద్వారా మా మార్కెట్‌ వాటాను పెంచుకోవడంతోపాటు, స్థిరమైన వృద్ధిని నమోదు చేయాలనుకుంటున్నాం’’అని డాబర్‌ తెలిపింది. దేశీయ డిమాండ్‌ పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్‌ లీలాధర్‌ సైతం చెబుతోంది. కాకపోతే వర్షాలు, వాతావరణ మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ వినియోగాన్ని ఆలస్యం చేయవచ్చన్న అభిప్రాయంతో ఉంది.

మరిన్ని వార్తలు