ఇండియన్ పబ్‌జీ(ఫౌజీ) విడుదల రేపే!

25 Jan, 2021 15:37 IST|Sakshi

న్యూఢిల్లీ: గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వదేశీ ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ "ఫౌజీ"ని 72వ గణతంత్రదినోత్సవ కానుకగా రేపు(జనవరి 26) విడుదల కాబోతోంది. ఈ స్వదేశీ గేమ్ ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లతో తన సత్తా చాటినట్లు ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పేర్కొన్నారు. ఈ గేమ్ ని అందరికంటే ముందే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫౌజీ మొబైల్ గేమ్ జనవరి 26న ప్రారంభించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!)

ఈ గేమ్ ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై ఎన్‌కోర్ గేమ్స్ తెలపలేదు. ఈ గేమ్ మొదట ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లకు అందుబాటులో రానున్నట్లు సమాచారం. పబ్‌జీపై నిషేధం విధించిన కొద్ది నెలల తర్వాత ఫౌజీ గేమ్‌ తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆయనే ఈ గేమ్‌కి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. అలానే ఫౌజీని బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్ గేమ్స్‌ అనే గేమింగ్ సంస్థ రూపొందించింది. 

ఫౌజీ, పబ్‌జీ రెండు వేర్వేరు 
ఫౌజీ ఒక మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్. చాలా మంది భారతీయ గేమర్స్ దీనిని పబ్‌జీ మొబైల్ కి ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు, ప్రస్తుతం భారతదేశంలో నిషేధించబడిన పబ్‌జీ మొబైల్‌తో పోల్చినప్పుడు ఫౌజీ చాలా భిన్నమైన గేమ్ అని ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ గేమ్ ప్రధానంగా ఒక కథాంశం ఆధారంగా కొనసాగుతుందని చెప్పారు. గత నాలుగు దశాబ్దాలలో చైనా, భారతదేశం మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో కూడా చాలా ఎపిసోడ్‌లు ఉంటాయి అని అన్నారు.

>
మరిన్ని వార్తలు