ఎఫ్‌డీసీ- బిర్లా టైర్స్‌.. హైజంప్‌

26 Aug, 2020 13:43 IST|Sakshi

రెండు వేరియంట్లలో ఫావిపిరవిర్‌ ఔషధం

6.5 శాతం జంప్‌చేసిన ఎఫ్‌డీసీ లిమిటెడ్

‌రూ. 1,100 కోట్ల నిధుల సమీకరణ సన్నాహాలు

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు బిర్లా టైర్స్

ఓ మాదిరి లక్షణాలతో సమస్యలు ఎదుర్కొంటున్న కోవిడ్‌-19 రోగుల చికిత్సకు వినియోగించగల ఫావిపిరవిర్‌ ఔషధాన్ని రెండు వేరియంట్లలో విడుదల చేసినట్లు వెల్లడించడంతో ఫార్మా రంగ కంపెనీ ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. మరోవైపు విభిన్న మార్గాలలో నిధులను సమీకరించనున్నట్లు తెలియజేయడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ బిర్లా టైర్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎఫ్‌డీసీ లిమిటెడ్‌
కోవిడ్‌-19 కారణంగా స్వల్ప లక్షణాలతో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వినియోగించగల ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్లను రెండు వేరియంట్లలో విడుదల చేసినట్లు ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఈ ఔషధానికి ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించడంతో తాజాగా పిఫ్లూ, ఫవెంజా బ్రాండ్లతో వీటిని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఒక్కో ట్యాబ్లెట్‌ ఖరీదు రూ. 55గా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 6.6 శాతం ఎగసి రూ. 338ను తాకింది. ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 331 వద్ద ట్రేడవుతోంది. 

బిర్లా టైర్స్‌ లిమిటెడ్‌
ఈక్విటీ లేదా రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 1,100 కోట్లవరకూ నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు బిర్లా టైర్స్‌ తాజాగా వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై శుక్రవారం(28న) నిర్వహించనున్న సమావేశంలో బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ షేర్లు లేదా మార్పిడిక వీలుకాని డిబెంచర్లు(ఎన్‌సీడీలు) తదితర సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బిర్లా టైర్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 23.40 వద్ద ఫ్రీజయ్యింది.

మరిన్ని వార్తలు