ఎఫ్‌డీఐ... రికార్డులు

7 Dec, 2020 05:32 IST|Sakshi

20 ఏళ్లలో 500 బిలియన్‌ డాలర్లు

మారిషస్‌ నుంచి అత్యధికంగా 29%

భారత్‌ వృద్ధి సామర్థ్యాలపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం

న్యూఢిల్లీ: కీలకమైన పెట్టుబడి కేంద్రంగా భారత్‌ ఆవిర్భవిస్తోందనడానికి సూచనగా గడిచిన ఇరవై ఏళ్లలో భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తాయి. తాజాగా కొత్త మైలురాయి అధిగమించాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం 2000 ఏప్రిల్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ మధ్య కాలంలో 500.12 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 29 శాతం మారిషస్‌ నుంచి ఉన్నాయి. మిగతావి సింగపూర్‌ (21 శాతం), అమెరికా, నెదర్లాండ్స్, జపాన్‌ (తలో 7 శాతం), బ్రిటన్‌ (6 శాతం) నుంచి వచ్చాయి. మారిషస్‌ నుంచి అత్యధికంగా 144.71 బిలియన్‌ డాలర్లు, సింగపూర్‌ నుంచి 106 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. జర్మనీ, సైప్రస్, ఫ్రాన్స్, కేమ్యాన్‌ ఐల్యాండ్స్‌ తదితర దేశాల ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్‌ చేశారు. 2015–16 నుంచి ఎఫ్‌డీఐల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2019–20లో రికార్డు స్థాయిలో 50 బిలియన్‌ డాలర్లు వచ్చాయి.  

సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌లో ఎక్కువగా..
సేవల రంగం, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌.. హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఫార్మా తదితర రంగాలు.. అత్యధిక స్థాయిలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి. 1999లో విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెరా) స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (ఫెమా) అమల్లోకి తెచ్చినప్పట్నుంచీ ఎఫ్‌డీఐల ప్రవాహం మొదలైందని నాంగియా ఆండర్సన్‌ ఇండియా పార్ట్‌నర్‌ నిశ్చల్‌ అరోరా తెలిపారు. అప్పట్నుంచీ 500 బిలియన్‌ డాలర్లు రావడమనేది పటిష్టమైన భారత ఆర్థిక మూలాలు, స్థిరమైన రాజకీయ పరిస్థితులు, 2007–08 నాటి మాంద్యంలోనూ మదుపుదారులకు మెరుగైన రాబడులిచ్చిన ఆర్థిక వృద్ధి సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు గల నమ్మకాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏ దేశంలోకైనా ఎఫ్‌డీఐలు రావాలంటే వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండటం, స్థల .. కార్మిక చట్టాలు.. పన్ను రేట్లును సరళతరంగా ఉండటం, నిపు ణుల లభ్యత, లాజిస్టిక్స్, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని డెలాయిట్‌ ఇం డియా పార్ట్‌నర్‌ రజత్‌ తెలిపారు. భారత్‌ ఇప్పటికే ఈ విషయాల్లో చాలా మెరుగుపడిందన్నారు.

మరిన్ని వార్తలు