బీమాపై ‘విదేశీ’ ముద్ర

2 Feb, 2021 05:19 IST|Sakshi

74 శాతానికి ఎఫ్‌డీఐల పరిమితి పెంపు

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 74 శాతానికి పెంచే ప్రతిపాదనను బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. మన దేశంలో బీమా ఉత్పత్తుల విస్తరణ ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండడంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కాకపోతే ఎఫ్‌డీఐ పెంపు అనంతరం కూడా బీమా కంపెనీల బోర్డుల్లో మెజారిటీ డైరెక్టర్లు, యాజమాన్యంలో కీలకమైన వ్యక్తులు అందరూ భారతీయులే ఉండాలన్న ‘కంపెనీ నిర్మాణాన్ని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు. బీమా చట్టం 1938ను సవరించడం ద్వారా బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రస్తుత 49% నుంచి 74%కి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. తగిన రక్షణలతో విదేశీ యాజమాన్యాన్ని, నిర్వహణను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని చివరిగా 2015లో అప్పటి వరకు ఉన్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం జరిగింది. మన దేశంలో జీవిత బీమా ఉత్పత్తుల వ్యాప్తి జీడీపీలో 3.6 శాతంగా ఉండగా, ప్రపంచ సగటు 7.13 శాతంతో పోలిస్తే తక్కువలో ఉండడం గమనార్హం. అదే సాధారణ బీమా విషయంలో ప్రపంచ సగటు 2.88 శాతం అయితే, మన దేశంలో మాత్రం వ్యాప్తి 0.94 శాతంగానే ఉంది.

మరిన్ని వార్తలు