ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం జూమ్‌

16 Jul, 2022 08:42 IST|Sakshi

ఫలితాల నేపథ్యంలో ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు

1.5 శాతం బలపడి రూ. 99 వద్ద ముగిసింది.  

ముంబై: ప్రైవేట్‌ రంగ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 601 కోట్లను తాకింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 367 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 1,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 3.22 శాతానికి చేరాయి. అయితే ఇతర ఆదాయం 30 శాతం క్షీణించి రూ. 453 కోట్లకు పరిమితమైంది. మరోవైపు ఫీజు ఆదాయం రూ. 255 కోట్ల నుంచి రూ. 441 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 373 కోట్లకు పరిమితమయ్యాయి. తాజా స్లిప్పేజెస్‌ రూ. 444 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 3.5 శాతం నుంచి 2.69 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 14.57 శాతంగా నమోదైంది.  

జేఎస్‌పీఎల్‌ లాభం హైజంప్‌ 
ప్రైవేట్‌ రంగ దిగ్గజం జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌(జేఎస్‌పీఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,771 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 14.2 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,643 కోట్ల నుంచి రూ. 13,069 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,234 కోట్ల నుంచి రూ. 10,567 కోట్లకు పెరిగాయి. కాగా.. క్యూ1లో స్టీల్‌ ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 1.99 మిలియన్‌ టన్నులకు పరిమితంకాగా.. అమ్మకాలు 1.61 ఎంటీ నుంచి 1.74 ఎంటీకి బలపడ్డాయి. పెల్లెట్‌ ఉత్పత్తి 2.16 ఎంటీ నుంచి 1.92 ఎంటీకి వెనకడుగు వేసింది. వీటి విక్రయాలు భారీగా క్షీణించి 0.03 ఎంటీకి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.  ఫలితాల నేపథ్యంలో జేఎస్‌పీఎల్‌ షేరు 4.5 శాతం పతనమై రూ. 345 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు