ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం 52% అప్‌

15 Oct, 2022 01:19 IST|Sakshi

క్యూ2లో రూ. 704 కోట్లు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం 52 శాతం (స్టాండెలోన్‌ ప్రాతిపదికన) పెరిగింది. వడ్డీ రాబడి, ఇతర ఆదాయాలు మెరుగుపడటంతో రూ.704 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 460 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 3,871 కోట్ల నుంచి రూ. 4,630 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన లాభం 50 శాతం పెరిగి రూ. 733 కోట్లకు చేరింది.

లాభాలపరంగా చూస్తే బ్యాంకు చరిత్రలోనే ఇది అత్యుత్తమ త్రైమాసికమని సంస్థ ఎండీ శ్యామ్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. ప్రొవిజన్‌ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్‌)కి సంబంధించి కేటాయింపులు భారీగా పెంచినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. సమీక్షాకాలంలో మొత్తం కేటాయింపులు 12.6 శాతం పెరిగి రూ. 506 కోట్లకు చేరాయి.

నికర వడ్డీ ఆదాయం 19.1 శాతం పెరిగి రూ. 1,762 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) 0.10 శాతం పెరిగి 3.30 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిమ్‌ 3.27–3.35 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసన్‌ తెలిపారు. రుణ వృద్ధిని బట్టి 2023లో అదనపు మూలధనాన్ని సమీకరించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక ఇతర ఆదాయం రూ. 492 కోట్ల నుంచి రూ. 610 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 3.24 శాతం నుంచి 2.46 శాతానికి దిగి వచ్చింది.

మరిన్ని వార్తలు