ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం జూమ్‌

17 Jan, 2023 06:04 IST|Sakshi

క్యూ3లో రూ. 804 కోట్లు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 54 శాతం దూసుకెళ్లి రూ. 804 కోట్లను తాకింది. అధిక వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 522 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,927 కోట్ల నుంచి రూ. 4,967 కోట్లకు ఎగసింది.

నికర వడ్డీ ఆదాయం 27 శాతం పుంజుకుని రూ. 1,957 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.22 శాతం మెరుగై 3.49 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.06 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి. ఈ బాటలో నికర ఎన్‌పీఏలు 1.24 శాతం నుంచి 0.73 శాతానికి నీరసించాయి. బాసెల్‌–3 నిబంధనల ప్రకారం కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) స్వల్ప వెనకడుగుతో 13.35 శాతంగా నమోదైంది. తొలి 9 నెలల్లో 60 బ్రాంచీలను జత చేసుకోగా క్యూ4లో మరో 20 ప్రారంభించనున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

ఫలితాల నేపథ్యంలో ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.2 శాతం బలపడి రూ. 140 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు