Gadgets: పండుగ సీజన్‌లో బాదుడు?..వీటి ధరలు పెరగనున్నాయ్‌!

24 Sep, 2021 13:13 IST|Sakshi

ఫెస్టివల్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు మార్కెట్‌లో విడుదలైన ప్రాడక్ట్‌ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి.డిమాండ్‌కు తగ్గట్లు ఆయా కంపెనీలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్‌లు అందిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకుంటుంటాయి. అయితే ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల ఉత్పత్తుల ధరల్ని 8 శాతం పెంచేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయంటూ ఎకనమిక్‌ టైమ్స్‌ ఓ నివేదికను వెలుగులోకి తెచ్చింది.

ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజనల్‌ సందర్భంగా కార్స్‌, బైక్‌, స్మార్ట్‌ ఫోన్స్‌, ల్యాప్‌ ట్యాప్‌, టీవీ, రిఫ్రిజిరేటర్‌, ఎయిర్‌ కండీషనర్‌ ప్రాడక్ట్‌ల ధరల్ని పెంచనున్నట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తన నివేదికలో తెలిపింది. వీటిలో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 8శాతం వరకు, టూవీలర్లరపై 1 నుంచి 2శాతం వరకు పెరగనున్నాయి.

బాష్, సిమెన్స్, హిటాచీ బ్రాండ్లు ధరలను 3 శాతం నుంచి 8 శాతానికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని సంస్థలు ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నాయి. ఈ సందర్భంగా ఐడిసి ఇండియా(ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ ఇండియా) రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ..కొన్ని కంపెనీలు వచ్చే నెల ప్రారంభంలో టీవీలు(టెలివిజన్లు), ఎయిర్ కండిషనర్లు,రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు,మైక్రోవేవ్ ఓవెన్‌ల వంటి గృహోపకరణాల ధరల్ని 3శాతం నుంచి 7శాతం ధరల్ని పెంచేలా  నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.  

ఆటోమొబైల్‌ కేటగిరిలో పెరిగిన ధరలు 


ఈ ఏడాదిలో ఇప్పటికే ఆటోమొబైల్‌ రంగానికి చెందిన టూవీలర్లు, కార్ల ధరలు పెరిగాయి. ఆయా మోడల్‌ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉన్న కార్ల ధర రూ.50వేల నుంచి రూ.2.5లక్షల వరకు పెరిగింది. అదే సమయంలో  టూవీలర్‌ ధరలు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెంచాయి. ఇక గత 12 నుంచి 18నెలల కాలంలో ఆయా సీజన్లను బట్టి కార్, టూవీలర్లపై అందించే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ 10 నుంచి 15శాతం వరకు పెరిగాయి.  అయితే పెరుగుతున్న ధరల్ని బట్టి కొనుగోలు దారులు మైండ్‌ సెట్‌ మారిపోయిందని, ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అత్యధికంగా అమ్ముడైన  పది కార్ల మోడళ్ల ధర ఐదు సందర్భాల్లో మారిందని  కన్సల్టెన్సీ జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి భాటియా చెప్పారు. 

వీటితో పాటు స్టీల్ ధర రెట్టింపు అయ్యింది. అల్యూమినియం, రాగి ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. సెమీకండక్టర్ కొరతతో  చిప్ ధరలు 25 శాతం నుంచి 75శాతానికి పెరిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తన నివేదికలో పేర్కొంది. అన్నింటికీ మించి సరుకు రవాణా వ్యయాలు 2 నుంచి 3 రెట్లు పెరగడంతో దిగుమతులకు మరింత భారంగా మారింది.  ఇక మార్కెట్‌లో స్మార్ట్‌ ఫోన్ల మోడళ్ల విడుదల పెరిగిపోవడంతో పలు సంస్థలు స్మార్ట్‌ఫోన్ ధరల్ని  3నుంచి 5శాతం పెంచగా.. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు