కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!

13 Jan, 2022 07:46 IST|Sakshi

కేసుల మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకోవద్దు

ఆసుపత్రుల్లో చేరికల సంఖ్యేనే ప్రాతిపదికగా తీసుకోవాలి 

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌-19 థర్డ్‌ వేవ్‌ విజృంభన, కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం, ప్రభుత్వాల ఆంక్షలు మొదలుకావడం వంటి అంశాల నేపథ్యంలో పారిశ్రామిక మండలి-ఫిక్కీ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఆంక్షలు విధించడానికి మొత్తం కేసుల సంఖ్య పెరుగుదలను, పాజిటివ్‌ రేటును కాకుండా, ఆసుపత్రుల్లో చేరికల సంఖ్యేనే ప్రాతిపదికగా తీసుకోవాలని కోరింది. ప్రత్యేకించి క్రిటికల్‌ కేర్‌ బెడ్స్, ఆక్సిజన్‌ లభ్యత వంటి అంశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాని కోరింది. ఫిక్కీ ప్రెసిడెంట్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ హెడ్‌ సంజయ్‌ మెహతా ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియాకు ఒక లేఖ రాశారు. లేఖలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

  • ప్రైవేట్‌ కార్యాలయాల ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని చెప్పడం నుంచి సినిమా హాళ్లను మూసివేయడం-రెస్టారెంట్లలో భోజనం చేయడం వరకు పలు ఆంక్షలను స్థానికంగా అధికారులు విధిస్తున్నారు. దీని ప్రభావంపై భారత్‌ కార్పొరేట్‌ రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలే బలహీనంగా ఉన్న ఆర్థిక రికవరీపై ఈ ఆంక్షలు తదుపరి మరింత ప్రభావాన్ని చూపుతాయి.  
  • ప్రస్తుతం దాదాపు 14 రోజుల వరకూ ఉన్న హోమ్‌ క్వారంటైన్‌ కాల పరిమితిని 5 రోజులకు తగ్గించండి. మొత్తం జనాభాకు బూస్టర్‌ డోస్‌ తప్పనిసరి చేయండి. 12 సంవత్సరాల పిల్లలనూ వ్యాక్సినేషన్‌ పరిధిలోనికి తీసుకుని రావాలి.  
  • అందుతున్న డేటా ప్రకారం చాలా మంది రోగులు 3-5 రోజులలోపు కోలుకునే పరిస్థితి ఉంది. అందువల్ల వ్యక్తిగత క్వారంటైన్‌ కాలపరిమితిని ఐదు రోజులకు పరిమితం చేయాలి. ఆరోగ్య సంరక్షణ కార్మికుల విషయంలో ఈ నిర్ణయం ఎంతో కీలకం. ఎందుకంటే ఎక్కువ కాలం క్వారంటైన్‌లో ఉండే పరిస్థితి ఉంటే, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికుల కొరత వంటి క్లిష్ట సమస్యలు ఎదురుకావచ్చు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తక్కువ క్వారంటైన్‌ సమయం పాటిస్తుండడం గమనార్హం.  
  • సవాళ్లను ఎదుర్కొనగలిగే స్థాయిలో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక వ్యవస్థ  పెంచాలి. హాస్పిటలైజేషన్, క్రిటకల్‌ కేర్‌ బెడ్స్, ఆక్సిజన్‌ లభ్యత ప్రాతిపదికన ఆంక్షలు దాదాపు స్థానికంగా పరిమితమయ్యేలా చర్యలు తీసుకోవాలి. జీవితాలు-జీవనోపాధిని సమతుల్యం చేసే ప్రధాన ధ్యేయంతో జాతీయ స్థాయిలో తగిన సమన్వయ వ్యూహం ఉండాలి. 
  • రాష్ట్రం, నగరం, మునిసిపాలిటీ.. అన్నిచోట్లా ఒకేవిధమైన ఆంక్షలు మహమ్మారిని వ్యాప్తిని అరికట్టడానికి దోహదపడవు. పైగా ఆర్థిక రికవరీకి ఇబ్బందిగా మారతాయి. మహమ్మారి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే ప్రత్యేక దృష్టి 
  • అవసరం.  
  • ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి కారణంగా ఇటీవలి కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అయితే శాస్త్రీయ హేతుబద్ధత, తగిన డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యాక్సినేషన్‌ విస్తృతి వంటి చర్యలతో భారతదేశం కోవిడ్‌–19కి వ్యతిరేక  పోరాటంలో మరోసారి విజయం సాధించగలదని పరిశ్రమ విశ్వసిస్తోంది.  

అంతా ఒకే గాటన కట్టవద్దు: సీఐఐ 
మహమ్మారిని అరికట్టడానికి అన్ని ప్రాంతాలనూ ఒకే గాటన కట్టరాదని  కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ఒక ప్రత్యేక ప్రకటనలో రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. అంటువ్యాధిని అరికట్టడానికి ‘మైక్రో-కంటైన్‌మెంట్‌ వ్యూహాన్ని’ అవలంభించాలని, మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.

(చదవండి: రుణాలు తీర్చాల్సిన బాధ్యత టెల్కోలదే: కేంద్ర మంత్రి వైష్ణవ్‌)

మరిన్ని వార్తలు