అయిదో రోజూ మార్కెట్‌ ముందుకే..

8 Oct, 2020 06:14 IST|Sakshi

సూచీలకు అధిక వెయిటేజీ షేర్ల అండ

రాణించిన ఆటో, ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు 

సెన్సెక్స్‌కు ట్రిపుల్‌ సెంచరీ లాభాలు

ముంబై: అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీతో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 304 పాయింట్ల లాభంతో 39,879 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 11,739 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,906 పాయింట్లు, నిఫ్టీ 516 పాయింట్లను ఆర్జించాయి. ఆటో, బ్యాంకింగ్, ఐటీ, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంక్, రియల్టీ, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,968– 39,451 పాయింట్ల మధ్య కదలాడగా, నిఫ్టీ 11,763– 11,629 రేంజ్‌లో ఊగిసలాడింది. బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1093 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1129 కోట్ల షేర్లను విక్రయించారు. ఎన్నికలకు ముందు అమెరికాకు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ ఉండదనే ట్రంప్‌ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా మన మార్కెట్‌ స్వల్ప నష్టంతో మొదలైంది.  

ఆదుకున్న హెవీ వెయిటేజీ షేర్ల ర్యాలీ  
నష్టాలతో మొదలై ఒడిదుడుకుల మధ్య ట్రేడ్‌ అవుతున్న సూచీలను అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ ఆదుకుంది. రిలయన్స్‌ రిటైల్‌లో తాజాగా అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ రూ. 5,513 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడినట్లు రిలయన్స్‌ ప్రకటనతో ఈ కంపెనీ షేరు 3 శాతం లాభపడింది. క్యూ2 ఫలితాలకు ముందు టీసీఎస్‌ షేరు ఒక శాతం ర్యాలీ చేసింది. రెండో త్రైమాసికంలో తమ వ్యాపారం సాధారణ స్థాయికి చేరుకుందని టైటాన్‌ తెలపడంతో ఈ షేరు 4.5 శాతం పెరిగింది. వీటికి తోడు మిడ్‌సెషన్‌ నుంచి ప్రైవేట్‌ బ్యాంక్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు వరుసగా 5 రోజూ లాభంతో ముగిశాయి.
మెరుగైన దేశీయ ఆర్థిక గణాంకాల వెల్లడితో పాటు కంపెనీల క్యూ2 గణాంకాల పట్ల ఆశావహ అంచనాల నుంచి మార్కెట్‌ సానుకూల సంకేతాలను అందిపుచ్చుకుందని ఈక్విటీ రీసెర్చ్‌ అధిపతి పారిస్‌ బోత్రా తెలిపారు. వ్యాపారాలు తిరిగి గాడిలో పడటంతో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్‌ కంపెనీల షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చిందన్నారు.

మరిన్ని వార్తలు