భారత్‌ స్టాక్‌ మార్కెట్‌లో తగ్గతున్న విదేశీ పెట్టుబడులు, కానీ

5 May, 2022 10:48 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. 2021 డిసెంబర్‌ చివరికి ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో.. విదేశీ ఇనిస్టిట్యూషన్స్‌ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) వాటాలు 9 ఏళ్ల కనిష్టానికి తగ్గాయి. కానీ, అదే సమయంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఇనుమడిస్తోంది. 14 ఏళ్ల గరిష్టానికి రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాలు పెరిగాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఐఐల వాటా ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో 0.81 శాతం తగ్గి 19.7 శాతానికి పరిమితమైంది. ఇలా ఎఫ్‌ఐఐల వాటాలు క్షీణించడం వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ నమోదైంది.

నిఫ్టీ 500 కంపెనీల్లో అయితే డిసెంబర్‌ క్వార్టర్‌లో ఎఫ్‌ఐఐల వాటాలు 0.65 శాతం తగ్గి 20.9 శాతంగా ఉంది. ఈ వివరాలను ఎన్‌ఎస్‌ఈ నివేదిక వెల్లడించింది. 2021 మొత్తం మీద ఎఫ్‌ఐఐల వాటా ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో 2.04 శాతం, ఎన్‌ఎస్‌ఈ 500 కంపెనీల్లో 1.65 శాతం మేర తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా వాటాలు తగ్గిపోవడం వెనుక గత ఏడాదిగా విదేశీ ఇనిస్టిట్యూషన్స్‌ భారత మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తుండడం ప్రధాన కారణంగా ఉంది. ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా ఆంక్షలు ఇలా ఎన్నో అనిశ్చితుల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణను నిరాటంకంగా, మరీ ముఖ్యంగా గత ఆరు నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. 

రెండేళ్లలో మారిన పరిస్థితి..   
ఎఫ్‌ఐఐ పెట్టుబడులు ఎక్కువగా ఉండే కంపెనీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్‌ త్రైమాసికంలో నిఫ్టీ 50 కంపెనీల్లో 0.21 శాతం పెరిగి 8.3 శాతానికి చేరింది. నిఫ్టీ 500 కంపెనీల్లో 0.29 శాతం పెరిగి 9 శాతానికి.. ఎన్‌ఎస్‌ఈ మొత్తం లిస్టెడ్‌ కంపెనీల్లో 0.36 శాతం పుంజుకుని 9.7 శాతానికి రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాలు చేరాయి. గడిచిన రెండేళ్లలో ఈక్విటీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రవేశం ఎన్నో రెట్లు పెరిగింది. కొత్త ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు, క్యాష్‌ మార్కెట్లో వారి లావాదేవీలు అధికమయ్యాయి. 2019 డిసెంబర్‌ త్రైమాసికం నుంచి చూస్తే 2021 డిసెంబర్‌ నాటికి ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో రిటైలర్ల వాటా నికరంగా 1.3 శాతం పెరిగింది.  

ఫండ్స్‌కు సిప్‌ కళ 
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా రిటైలర్ల ప్రాతినిధ్యం పెరిగేందుకు దోహదం చేస్తోంది. సిప్‌ పెట్టుబడులు ప్రతీ నెలా కొత్త గరిష్టాలకు చేరుతుండడాన్ని గమనించొచ్చు. ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో మ్యూచువల్‌పండ్స్‌ వాటా వరుసగా రెండో త్రైమాసికం (డిసెంబర్‌ క్వార్టర్‌)లోనూ 0.11 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. 

2020 మార్చి త్రైమాసికం నాటికి ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌కు గరిష్టంగా 7.9 శాతం వాటా ఉంది. దీనికంటే ప్రస్తుతం 0.46 శాతం తక్కువగానే వాటి వాటా ఉన్నట్టు అర్థమవుతోంది. పెరుగుతున్న సిప్‌ పెట్టుబడులతో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు లాభపడతున్నాయి. పెద్ద కంపెనీల్లోనే వీటి వాటాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సిప్‌ పెట్టుబడుల రాక వీటి ప్రాతినిధ్యం అధికమయ్యేందుకు సాయపడుతోంది. ఎన్‌ఎస్‌ఈ 500 కాకుండా ఇతర కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటాలు తగ్గడం గమనార్హం.  

చిన్న సంస్థల పట్ల ఎఫ్‌ఐఐల్లో ఆసక్తి
ప్రధాన సూచీల్లోని కంపెనీల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల్లో మాత్రం పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ పెట్టుబడుల పూల్‌లోకి కొత్తగా 260 కంపెనీలను వారు చేర్చుకున్నారు. 5 శాతానికి పైగా ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఉన్న కంపెనీల సంఖ్య 600 స్థాయిలోనే కొనసాగుతోంది. అంటే వారి నుంచి తాజా పెట్టుబడులు మిడ్, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లోకి వెళుతున్నట్టు అర్థమవుతోంది.   

మరిన్ని వార్తలు