ఐటీ రిటర్న్‌ దాఖలు చేసే వారికి బంపరాఫర్‌..!

25 Dec, 2021 16:10 IST|Sakshi

File ITR To Get A Chance To Win Royal Enfield Bullet: 2021 ఆర్థిక సంవత్సరానికిగాను డిసెంబర్‌ 31తో ఐటీ రిటర్న్‌ గడువు పూర్తి కానుంది. దీంతో ఐటీఆర్ ఫైలింగ్‌ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు ఆఫర్‌లతో ముందుకు వచ్చింది. డిసెంబర్‌ 31 వరకు 1000కిపైగా ఐటీఆర్‌ దాఖలు చేసిన(విలేజ్‌ లేవల్‌ ఎంట్రిప్యూనర్స్‌) వీఎల్‌ఈలకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బంపరాఫర్‌ ప్రకటించింది. 1000కిపైగా లక్ష్యాన్ని చేరుకున్న వీఎల్‌ఈలు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌ను సొంతం చేసుకోవచ్చునని సీఎస్‌సీ ట్విటర్‌లో పేర్కొంది. 

బుల్లెట్‌ బండి..లక్ష గెలుచుకునే అవకాశం..!
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డిజిటల్‌ సేవల పోర్టల్‌ కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ దేశవ్యాప్తంగా 75,000 కంటే ఎక్కువ కేంద్రాలను నడుపుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 25 లక్షల మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని సీఎస్‌సీ ఆశిస్తోంది. ఐటీఆర్‌ దాఖలును మరింత వేగం పెంచడం కోసం వీఎల్‌ఈలకు బంపరాఫర్‌ ట్విటర్‌లో ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వీఎల్‌ఈలు 2021 డిసెంబర్ 31 లోగా 1000 మందితో ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను గెలుచుకునే అవకాశం పొందనున్నారు. అంతేకాకుండా వీఎల్‌ఈలు రూ.1 లక్ష వరకు కమీషన్‌లను కూడా గెలుచుకోవచ్చునుని సీఎస్‌సీ పేర్కొంది .

భారీగా పెరిగిన ఐటీఆర్‌ దాఖలు..!
గత ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లకు పైగా ఐటీఆర్‌లు ఈ-ఫైలింగ్‌ అయ్యాయి. 2021 డిసెంబర్ 21వ తేదీన ఒక్కరోజే దాదాపు 8.7 లక్షల రిటర్న్‌లు దాఖలయ్యాయని ఐటీ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో  పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ కావడంతో...ఈ-ఫైలింగ్‌లో భారీ పెరుగుదల కన్పిస్తోంది. గత ఏడు రోజుల్లో 46.77 లక్షల మంది తమ ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారని తెలుస్తోంది. 

చదవండి: దివాలా చట్టంలో కీలక సవరణలకు కేంద్రం కసరత్తు..!

మరిన్ని వార్తలు