అమ్మకానికి ఎయిరిండియా.. దక్కించుకునేది ఎవరు ?

15 Sep, 2021 12:08 IST|Sakshi

పెట్టుబడుల ఉపసంహార కార్యక్రమాన్ని వేగవంతం చేసింది ఎన్డీఏ సర్కారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియా అమ్మకానికి మరోసారి రంగం సిద్ధం చేసింది.

నేటితో ఆఖరు
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ ఇండియా నిర్వాహణపరమైన లోపాలతో నష్టాల పాలైంది. ఇప్పటి వరకు ఎయిర్‌ ఇండియా నష్టాలు రూ. 43,000 కోట్లుగా తేలాయి. దీంతో ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్‌ దాఖలు చేసేందుకు 2021 సెప్టెంబరు 15 చివరి తేదీగా నిర్ణయించింది. ఇకపై గడువు పెంచబోమంటూ ఏవియేషన్‌ మినిష్టర్‌ జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. 

రెండోసారి
ఎయిర్‌ ఇండియాను 2018లోనే కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఎయిర్‌ ఇండియాలో కనీసం 76 శాతం వాటాను కొనుగోలు చేయాలని షరతు విధించింది. అయితే ఏ ఒక్క కంపెనీ కేంద్రం విధించిన షరతులు అనుసరించి ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో రెండో సారి ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు సంబంధించి బిడ్లను కేంద్రం ఆహ్వానించింది. ఈసారి ఒకే సంస్థ కాకుండా రెండు సంస్థలు కలిసి బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చంటూ కొంత వెసులుబాటు కల్పించింది. అదే విధంగా వంద శాతం వాటాలను విక్రయించాలని కూడా నిర్ణయించింది.

బరిలో ఎవరు ?
ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు సంబంధించి చివరి తేది వరకు కూడా పెద్దగా కంపెనీలు ఆసక్తి చూపించలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు టాటా గ్రూపుతో పాటు స్పైస్‌ జెట్‌ సంస్థలు ఎయిర్‌ఇండియా కొనుగోలకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్‌ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం.

వేల కోట్ల రూపాయల ఆస్తులు
ఎయిర్‌ ఇండియా భారీగా నష్టాల పాలైనప్పటికీ వేల కొట్ల విలువ చేసే ఆస్తులు ఆ సంస్థకి ఉన్నాయి. ముంబై, ఢిల్లీలలో నగరం నడిబొడ్డున ఎకరాల కొద్ది స్థలం అందుబాటులో ఉంది. దీనికి తోడు దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో సిబ్బంది క్వార్టర్స్‌ రూపంలో కూడా ఆస్తులు ఎయిర్‌ ఇండియా పేరిట ఉన్నాయి. విదేశాల్లో సైతం ఎయిర్‌ఇండియాకు అనేక ఆస్తులు ఉన్నాయి.
చదవండి : డిసెంబరే టార్గెట్‌.. ఎయిరిండియాను అమ్మేయడానికే

మరిన్ని వార్తలు