బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి కీలక భేటీ

3 Sep, 2020 16:59 IST|Sakshi

సెప్టెంబర్‌ 15 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ సిద్ధం

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19తో ప్రభావితమైన వ్యాపార సంస్థలను కాపాడేందుకు సెప్టెంబర్‌ 15 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకులను కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో గురువారం నిర్మలా సీతారామన్‌ సమావేశమయ్యారు. రుణాల పునర్వ్యవస్థీకరణకు బోర్డు ఆమోదించిన విధానాన్ని సత్వరమే అమలు చేసేందుకు బ్యాంకులు సిద్ధం కావాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పథకానికి అర్హులైన రుణగ్రహీతలను గుర్తించి సత్వరమే వారిని సంప్రదించి ఆయా వ్యాపారాలను బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్‌-19తో దెబ్బతిన్న రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలుకు సన్నద్ధతను ఆయా బ్యాంకుల సీఈఓలతో సమీక్షించారు. చదవండి : ఆర్‌బీఐకి చిదంబరం కీలక సలహా

రుణాల చెల్లింపులపై మారటోరియంను ఎత్తివేసే సమయంలో రుణగ్రహీతలకు బ్యాంకులు బాసటగా నిలవాలని సూచించారు. రుణగ్రహీతల రుణసామర్ధ్యంపై ప్రభావం లేనివిధంగా వ్యవహరించాలని అన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణపై తాము పూర్తిసమాచారాన్ని పలు భాషల్లో తమ వెబ్‌సైట్లపై అందుబాటులో ఉంచామని బ్యాంకులు ఆమెకు వివరించారు. తాము రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులైన రుణగ్రహీతలను గుర్తించే ప్రక్రియను  ఇప్పటికే ప్రారంభించామని బ్యాంకులు వివరించాయి. కంపెనీలు, వాణిజ్య సంస్ధలతో పాటు వ్యక్తిగత రుణగ్రహీతల అవసరాలను గుర్తెరిగి బ్యాంకులు చురకుగా స్పందించాలని మంత్రి సూచించారు. కాగా, కార్పొరేట్‌, ఎంఎస్‌ఎంఈ, వ్యక్తిగత రుణం సహా వివిధ రుణగ్రహీతలకు ఆగస్ట్‌ 6న ఆర్‌బీఐ రుణ పునర్వ్యవస్థీకరణను ప్రకటించింది. రుణ పునర్వ్యవస్థీకరణ కోసం రుణగ్రహీతలు ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా బ్యాంకులను కోరవచ్చు. ఈ ప్రతిపాదనకు బ్యాంకులు అంగీకరించిన 180 రోజుల్లోగా రుణ పునర్వ్యవస్థీకరణ అమలవుతుంది.

మరిన్ని వార్తలు