Bank Exams: బ్యాంక్‌ ఉద్యోగాల భర్తీకి బ్రేక్‌, తెలుగులోనే ఎగ్జామ్‌ ఉంటుందా?

14 Jul, 2021 07:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్‌ ఉద్యోగాల భర్తీకి బ్రేక్‌ పడింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌కు (ఐబీపీఎస్‌) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో క్లరికల్‌ క్యాడర్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు ఐబీపీఎస్‌ ఇటీవల ప్రకటన వెలువరించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ కేడర్‌కు స్థానిక/ప్రాంతీయ భాషల్లో టెస్ట్‌ నిర్వహించాలన్న డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కమిటీ తన  సిఫార్సులను 15 రోజుల్లో ఇస్తుంది. ఈ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు పరీక్షను నిలిపివేస్తున్నాం’ అని వెల్లడించింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు పెట్టాలన్న డిమాండ్‌ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి  వెల్లువెత్తుతోంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగాల భర్తీకి ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్‌ నిర్వహించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ 2019 జూలైలో పార్లమెంటులో స్పష్టం చేసింది. 

చదవండి: మీరేం పెద్దమనుషులయ్యా, 35వేల కోట్ల జీఎస్‌టీ ఎగ్గొట్టారు

మరిన్ని వార్తలు