బడ్జెట్‌ తయారీ ప్రక్రియకు శ్రీకారం

17 Oct, 2020 05:20 IST|Sakshi

సీనియర్‌ అధికారులతో ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ చర్చలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో... తన మూడవ బడ్జెట్‌ తయారీ ప్రక్రియకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జరిగిన మొట్టమొదటి సమావేశంలో ఆర్థిక సేవలు, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గృహ, ఉక్కు, విద్యుత్‌ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ఆర్థికమంత్రిత్వశాఖ షెడ్యూల్‌ ప్రకారం  నవంబర్‌ 12వ తేదీనాటికి బడ్జెట్‌ తయారీలో కీలక సమావేశ ప్రక్రియ పూర్తవుతుంది.  2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సవరిత అంచనాలు (ఆర్‌ఈ), 2021–22 బడ్జెట్‌ అంచనాలు (బీఈ) దాదాపు నెలరోజుల్లో ఖరారవుతాయి. ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రెండంకెలకు చేరే అవకాశాలు కనిపిస్తుండడం వంటి అంశాల నేపథ్యంలో తాజా బడ్జెట్‌ రూపకల్పనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో ఎనానమీ 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో... 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం నుంచి 15 శాతం వరకూ క్షీణిస్తుందని ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు అంచనావేసిన సంగతి తెలిసిందే. కాగా బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియలో జరగనున్న సమావేశాలకు అన్ని శాఖల నుంచి గరిష్టంగా ఐదుగురు సభ్యులకన్నా ఎక్కువమంది హాజరుకాకుండా నియంత్రణలు విధించనున్నట్లు ఆర్థిక శాఖలో బడ్జెట్‌ విభాగం పేర్కొంది. అదీ డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ స్థాయి వ్యక్తులకే ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కోవిడ్‌–19 తీవ్రత నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి కూడా ఇది మూడవ బడ్జెట్‌. ఫిబ్రవరి 1వ తేదీన 2021–22 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు