పన్నుల వ్యవస్థలో విప్లవాత్మకం... జీఎస్‌టీ

25 Aug, 2020 06:34 IST|Sakshi

పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపు

తగ్గిన పన్నుల భారంతో 1.24 కోట్లను దాటిన అసెస్సీలు

ఆరుణ్‌జైటీ మొదటి వర్ధంతి  సందర్భంగా ఆర్థికశాఖ ట్వీట్స్‌  

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పన్నుల భారం తగ్గిందని, దీనితో సరళతర పన్ను వ్యవస్థలో పన్నులు చెల్లించే వారి సంఖ్య దాదాపు రెట్టింపై 1.24 కోట్లకు పెరిగిందనీ ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఆర్థికశాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ పలు ట్వీట్స్‌ చేసింది. దాదాపు 17 రకాల స్థానిక లెవీలు, 13 సెస్‌ల ఉపసంహరణలతో 2017 జూలై 1న జీఎస్‌టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు బాధ్యతల్లో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్‌జైట్లీ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ తాజా ట్వీట్స్‌ సారాంశాన్ని పరిశీలిస్తే...

► జీఎస్‌టీ ప్రవేశపెట్టకముందు అమల్లో ఉన్న బహుళ పరోక్ష పన్నుల వ్యవస్థ–  వ్యాల్యూయాడెడ్‌ ట్యాక్స్‌ (వీఏటీ), ఎక్సైజ్, అమ్మకపు పన్ను వాటికి సంబంధించిన ఇతర చార్జీల వల్ల దేశ పౌరులపై అధిక పన్ను భారం ఉండేది.  31 శాతం వరకూ ఉన్న అధిక స్థాయి పన్ను రేటు ధరలపై ప్రభావం చూపేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పోయింది. తాజా వస్తు,సేవల పన్ను విధానం అటు వినియోగదారుకు అటు పన్ను చెల్లింపుదారుకూ స్నేహపూర్వకమైంది.  

► జీఎస్‌టీకి ముందు అధిక పన్ను భారం వల్ల ఈ చట్రంలోకి రావడానికి వెనుకడుగు వేసే పరిస్థితి. అయితే సరళతర జీఎస్‌టీ వ్యవస్థలో పన్ను భారం తగ్గింది. దీనితో పన్ను చెల్లింపుదారు బేస్‌ కూడా పెరిగింది.  

► జీఎస్‌టీ తొలినాళ్లలో అసెస్సీల సంఖ్య 65 లక్షలయితే, ఇప్పుడు ఈ సంఖ్య 1.24 కోట్లను దాటింది.  
 

► జీఎస్‌టీ అమల్లో అరుణ్‌జైట్లీ పాత్ర కీలకమైనది. భారత్‌ పన్నుల వ్యవస్థలో జీఎస్‌టీ ఒక చరిత్రాత్మక సంస్కరణ.  అప్పట్లో వివిధ రాష్ట్రాలు విధించే విభిన్న పన్ను రేట్లు తీవ్ర వ్యయ భరితంగా ఉండేవి. ప్రజలు పన్నులు చెల్లించే స్థాయికి రేట్లను జీఎస్‌టీ తగ్గించింది. అప్పట్లో రెవెన్యూ న్యూట్రల్‌ రేటు 15.3 శాతం అయితే, దానితో పోల్చితే ఇప్పుడు జీఎస్‌టీ రేటు 11.6 శాతానికి తగ్గింది.  

► రూ.40 లక్షల వరకూ వార్షిక టర్నోవర్‌ ఉన్న వ్యాపారాలపై ఇప్పుడు జీఎస్‌టీ మినహాయింపు ఉంది. ప్రారంభంలో ఇది రూ.20 లక్షలుగా ఉండేది. దీనికితోడు రూ.1.5 కోట్ల వరకూ టర్నోవర్‌ ఉన్న ఒక కంపెనీ కాంపోజిషన్‌ స్కీమ్‌ కింద కేవలం ఒక శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది.  

► జీఎస్‌టీ అమల్లోకి రావడంతోటే అనేక వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం జరిగింది.  28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న దాదాపు 230 వస్తువుల్లో  దాదాపు 200 వస్తువులను  తక్కువ స్లాబ్స్‌ రేట్లలోకి మార్చడం జరిగింది. హౌసింగ్‌ రంగాన్ని 5 శాతం శ్లాబ్‌లో ఉంచగా, చౌక గృహాలకు సంబంధించి జీఎస్‌టీ రేటును ఒక శాతానికి తగ్గింది.
 

►  జీఎస్‌టీకి సంబంధించిన ప్రాసెస్‌ అంతా పూర్తిగా ఆటోమేటెడ్‌ చేయడం మరో విషయం. ప్రస్తుతం 50 కోట్ల రిటర్న్స్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం జరిగింది. 313 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్‌ అయ్యాయి.  

స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ
2017 జూలై 1వ తేదీ అర్థరాత్రి నుంచీ భారత పన్నుల వ్యవస్థలో చరిత్రాత్మక మార్పు. ఒకే మార్కెట్‌గా భారత్‌ ఆవిర్భవించింది. బహుళ పన్ను వ్యవస్థకు తెరపడింది. ప్రస్తుతం 480 వస్తువులు పన్ను రహిత లేదా 5 శాతంలోపు పన్ను రేట్లలో ఉన్నాయి. 221 వస్తువులు 12 శాతం రేటు వద్ద, 607 వస్తువులు 18 శాతం రేటు వద్ద ఉండగా, కేవలం 29 వస్తువులు మాత్రమే 28% రేటు వద్ద ఉన్నాయి.

ఆయా సడలింపుల నేపథ్యంలో పన్ను గడచిన మూడేళ్లలో పన్ను బేస్‌ పెరిగింది. 2017–18 తొమ్మిది నెలల్లో (జూలై–మార్చి) సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. 2018–19లో నెలకు సగటు రెవెన్యూ 10% పెరిగి మొత్తంగా ఆదాయాలు రూ.97,100 కోట్లకు చేరాయి. 2019–20లో ఈ ఆదాయం ఏకంగా రూ.1,02,000కోట్లకు ఎగసింది. రేట్ల తగ్గింపు, పలు సడలింపులు ఇస్తున్నప్పటికీ, జీఎస్‌టీ స్థిరంగా పెరుగుతూ వస్తున్న విషయం గమనార్హం. కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో, జీఎస్‌టీ భారం తగ్గడానికి ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ప్రవేశపెట్టింది.  
– అరుణ్‌జైట్లీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక ఆర్టికల్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌

మరిన్ని వార్తలు