జీఎస్‌టీ పరిహారంగా రాష్ట్రాలకు రూ.75,000 కోట్లు

16 Jul, 2021 05:18 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల  పన్ను (జీఎస్‌టీ) పరిహారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75,000 కోట్లను విడుదల చేసినట్లు  ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. లగ్జరీ, ఆల్కహాల్, పొగాకు వంటి సిన్‌ గూడ్స్‌ నుంచి వసూలు చేసే వాస్తవిక సెస్‌ (ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం లక్ష కోట్లు ఉంటుందని అంచనా) నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి విడుదల చేసే జీఎస్‌టీ పరిహారానికి ఇది అదనమని ప్రకటన వివరించింది. రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లుగా ఉంటుందన్నది కేంద్రం అంచనా.

ఇందులో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.1.59 లక్షల కోట్ల రుణ సమీకరణ జరిపి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని మే 28వ తేదీన జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. మిగిలిన పరిహారాన్ని స్థిర వాయిదాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ఆరు నెలల కాలంలో విడుదల చేయనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్రాలు, కేంద్రం పాలిత ప్రాంతాలు కోల్పోయే ఆదాయాలను కేంద్రం భర్తీ చేయాలన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ‘‘అంగీకరించిన రూ.1.59 లక్షల కోట్ల బదలాయింపుల్లో దాదాపు సగం మొత్తాన్ని ఒకే ఇన్‌స్టాల్‌మెంట్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది’’ అని ఒక ట్వీట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు