అత్యవసర రుణ హామీ పథకంపై కేంద్రం ఆర్ధిక శాఖ రివ్యూ!

20 Feb, 2023 09:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు, టాప్‌–4 ప్రైవేటు రంగ బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 22న సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి రావాలంటూ బ్యాంకుల అధినేతలకు కబురు పంపింది.

కరోనా సమయంలో అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. లాక్‌డౌన్‌లతో దెబ్బతిన్న వ్యాపార సంస్థలకు రుణ సాయం ద్వారా ఆదుకోవడం ఈ పథకం ఉద్దేశ్యం. దీని పురోగతిని సమావేశంలో సమీక్షించనున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అలాగే, కరోనా వల్ల ప్రభావితమైన రంగాలకు రుణ హామీ పథకం (ఎల్‌జీఎస్‌సీఏఎస్‌)ను సైతం సమీక్షించనున్నట్టు తెలిపాయి.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వివేక్‌ జోషితోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల సీఈవోలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాక్‌ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈసీఎల్‌జీఎస్‌ కింద హామీ లేని రూ.4.5 కోట్ల వరకు రుణాలను బ్యాంకులు మంజూరు చేయవచ్చు.    

మరిన్ని వార్తలు