ఐడీబీఐ వివరాలకు మరింత గడువు

29 Oct, 2022 11:00 IST|Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఆధ్యర్యంలోని ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయ ప్రాసెస్‌కు ఆర్థిక శాఖ తాజాగా గడువును పొడిగించింది. ఆసక్తిగల సంస్థలు నవంబర్‌ 10లోగా వివరాలు తెలుసుకునే(క్వెరీస్‌) వెసులుబాటును కల్పించింది. తదుపరి డిసెంబర్‌ 16లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ దాఖలు చేసేందుకు వీలుంటుంది. ఐడీబీఐ బ్యాంకులో 61 శాతం వాటా విక్రయించేందుకు ఈ నెల 7న ఆర్థిక శాఖ బిడ్స్‌కు ఆహ్వానం పలుకుతూ ప్రాథమిక సమాచార వివరాల(పీఐఎం)కు తెరతీసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా క్వెరీస్‌కు అక్టోబర్‌ 28వరకూ గడువు ప్రకటించింది.

అయితే దీపమ్‌ తాజాగా పీఐఎంను సవరిస్తూ నవంబర్‌ 10వరకూ గడువు పెంచింది. తద్వారా మార్చికల్లా ఫైనాన్షియల్‌ బిడ్స్‌కు వీలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి అర్ధభాగంలో బ్యాంకు ప్రయివేటైజేషన్‌ను పూర్తి చేయగలమని ఆశిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం, ఎల్‌ఐసీకి బ్యాంకులో గల 94.72 శాతం సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో స్వల్పంగా బలపడి రూ. 45 వద్ద ముగిసింది.

చదవండి: World smallest TV ప్రపంచంలోనే చిన్న టీవీ ఆవిష్కారం, ధర వింటే?

మరిన్ని వార్తలు