2021 బడ్జెట్‌ సంప్రదింపులు ఈ–మెయిల్‌ ద్వారానే...

14 Nov, 2020 05:30 IST|Sakshi

కరోనా ఎఫెక్ట్‌

ఆర్థికశాఖ నిర్ణయం

ఇందుకు త్వరలో ప్రత్యేక ఈ–మెయిల్‌ ఐడీ రూపకల్పన

'MyGov.in' పోర్టల్‌కూ ప్రజలు సూచనలు పంపవచ్చని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్‌ను రూపొందించడానికి ముందు  పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, వ్యాపార వాణిజ్య వర్గాలు,  తదితర రంగాల్లోని నిపుణులతో ఆర్థిక మంత్రి  నార్త్‌ బ్లాక్‌లో స్వయంగా సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తీసుకోవడం సాంప్రదాయకంగా వస్తోంది. ఇందుకు వేర్వేరు తేదీల్లో ఆర్థికమంత్రి సమావేశాలూ నిర్వహించేవారు. అయితే కరోనా మహమ్మరి వల్ల  ఈ సాంప్రదాయానికి  ఈ దఫా ‘విరామం’ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. 2021 బడ్జెట్‌ రూపకల్పన విషయంలో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, నిపుణులు తగిన సలహాలు ఇవ్వడానికి ఇందుకు త్వరలో ప్రత్యేక ఈ–మెయిల్‌ ఐడీ రూపకల్పన జరుగుతున్నట్లు శుక్రవారం ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  ‘‘ప్రత్యేక ఈ–మెయిల్‌ ఐడీ’’ ఏర్పాటు విషయంలో త్వరలో ఒక నిర్దిష్ట ప్రకటన వెలువరిస్తామని కూడా ప్రకటన వివరించింది.  

15 నుంచి 30 వరకూ   అందుబాటులో 'MyGov.in' పోర్టల్‌
అలాగే రానున్న బడ్జెట్‌పై వివిధ రంగాల్లో నిపుణులైన ప్రజల నుంచీ సలహాలను తీసుకోడానికి ప్రభుత్వ 'MyGov.in' పోర్టల్‌నూ ఒక వేదికగా వినియోగించుకోనున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. నవంబర్‌ 15 నుంచి 30వ తేదీ వరకూ ఈ పోర్టల్‌ ప్రజా సూచలనకు అందుబాటులో ఉంటుందని ఆర్థికశాఖ ప్రకటన తెలిపింది. ‘‘సాధరణ ప్రజలు తమతమ వ్యక్తిగత హోదాల్లో 'MyGov.in' పోర్టల్‌లో తమ పేరును నమోదుచేసుకుని 2021–22 బడ్జెట్‌కు సంబంధించి తమ సలహాలను సమర్పించవచ్చు. ఆయా సూచనలు, సలహాలను సంబంధిత మంత్రిత్వశాఖలు, విభాగాలూ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటాయి’’ అని ప్రకటన వివరించింది. తమకు అందిన సూచనలు, సలహాలపై అధికార వర్గాలు ఏదైనా వివరణ కోరదలిస్తే,  సూచలను చేసిన నిర్దిష్ట వ్యక్తులను ఈ మెయిల్‌ లేదా ఫోన్‌ నెంబర్‌ (రిజిస్ట్రేషన్‌ సమయంలో వారు సమర్పించిన) ద్వారా సంప్రదిస్తారని కూడా ఆర్థికశాఖ తెలియజేసింది.

కత్తిమీద సామే!
యథాపూర్వం 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూలతలు, ఉద్దీపన చర్యలు, ఆదాయాలు–వ్యయాలకు మధ్య భారీగా పెరిగిపోనున్న ద్రవ్యలోటు, మౌలిక రంగంపై భారీ నిధుల కేటాయింపులకు భారీ అవరోధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు తాజా బడ్జెట్‌ కత్తిమీద సాములాగా కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్‌. బడ్జెట్‌ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభమై, నవంబర్‌ మొదటి వారం వరకూ కొనసాగాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 

ఇతర శాఖల కార్యదర్శులతో సంప్రదింపుల తర్వాత వ్యయ విభాగం కార్యదర్శి 2021–22 బడ్జెట్‌ అంచనాలను ఖరారు చేస్తారు. ఈ దశలోనే కేంద్ర ఆర్థికశాఖ నిపుణుల సలహాలను ప్రత్యేక ఈ–మెయిల్‌ ఐడీ ద్వారా స్వీకరించనుంది.  తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో ఎనానమీ 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో... 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం నుంచి 15 శాతం వరకూ క్షీణిస్తుందని ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు అంచనావేసిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్‌ నుంచి  సెప్టెంబర్‌తో ముగిసే నెలకు ద్రవ్యలోటు 114.8 శాతానికి చేరడం గమనార్హం.   2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతం. అయితే,  ద్రవ్యలోటు  2020–21లో రెండంకెలకు పెరిగిపోయే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు