దేశంలో పెరిగిపోతున్న చెక్‌ బౌన్స్‌ కేసులు, కేంద్రం కీలక నిర్ణయం

10 Oct, 2022 07:42 IST|Sakshi

న్యూఢిల్లీ: చెక్‌ బౌన్స్‌ కేసులు దేశంలో భారీగా పెరిగిపోతుండడంపై దీనిని కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో నేరస్తులపై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం, చెక్‌ జారీ చేసిన అకౌంట్‌ నుంచే డబ్బు డెబిట్‌ కావాల్సి ఉంది. అయితే ఈ నిబంధనలను సవరించాలన్న సూచనలు వస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాలు ఈ మేరకు తెలిపిన సమాచారం ప్రకారం, ఇటీవల ఈ సమస్యపై ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణుల నుంచి పలు ప్రతిపాదనలు, సూచనలు అందాయి.  వీటిలో ప్రధానమైనవి చూస్తే... 

చెక్కు జారీ చేసిన వ్యక్తి ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించి అకౌంట్‌లో నిధులు తక్కువగా ఉన్నట్లయితే అతని లేదా ఆమె మరొక ఖాతా నుండి చెక్‌ అమౌంట్‌ డెబిట్‌ చేయాలన్న ప్రతిపాదన ఇందులో ఒకటి. 

అలాగే నేరస్తులు కొత్త ఖాతాలను తెరవడాన్ని నిషేధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు అందాయి.  

చెక్‌ బౌన్స్‌ను రుణ డిఫాల్ట్‌గా పరిగణించడం, నేరస్తుని స్కోర్‌ను అవసరమైనమేర డౌన్‌గ్రేడ్‌ చేయడం కోసం ఈ సమాచారాన్ని  క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు నివేదించడం కూడా ప్రతిపాదనలో ఉంది. ఈ సూచనలను ఆమోదించే ముందు తగిన చట్టపరమైన సలహాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఆయా చర్యలు, బ్యాంకింగ్‌ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా చెక్‌ బౌన్స్‌ కేసులను సమర్థవంతంగా తగ్గించవచ్చన్నది  నిపుణుల సూచన.  దేశ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు