దివాలా చట్టంతో రూ.60 వేల కోట్ల వసూలు!

8 Jun, 2021 13:53 IST|Sakshi

2021-22పై ఇక్రా అంచనా 

అత్యధిక మొత్తం 9 పద్దుల నుంచే

ముంబై: దివాలా చట్టం (ఐబీసీ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక రుణదాతలు దాదాపు రూ. 55,000-రూ. 60,000 కోట్ల దాకా రాబట్టుకోగలిగే అవకాశం ఉందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. 2020-21లో ఐబీసీలో భాగమైన కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రణాళిక(సీఐఆర్‌పీ) ద్వారా రుణదాతలకు రూ.26,000 కోట్లు మాత్రమే వచ్చాయని.. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు పావు వంతేనని తెలిపింది. ‘విజయవంతంగా పూర్తయ్యే సీఐఆర్‌పీల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక రుణదాతలు రూ. 55,000 - రూ. 60,000 కోట్ల దాకా వసూలు చేసుకోగలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం‘ అని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ అభిషేక్‌ దఫ్రియా పేర్కొన్నారు. 8-9 భారీ పద్దుల పరిష్కారంపైనే నికరంగా ఎంత వచ్చేది ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. వీటి నుంచి సుమారు 20 శాతం పైగా రావాల్సి ఉంటుందని వివరించారు. 

అంచనాలపై సెకండ్‌ వేవ్‌ ప్రభావం.. 
కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గకపోతే పరిష్కార ప్రక్రియల అమలు(ముఖ్యంగా చిన్న స్థాయి సంస్థలకు) నెమ్మదించే అవకాశం ఉందని దఫ్రియా చెప్పారు. దీనివల్ల రుణదాతలు మరింత ఎక్కువ వదులుకోవాల్సి రావచ్చన్నారు. ఫలితంగా రికవరీ అంచనాలపైనా ప్రతికూల ప్రభావం పడగలదని దఫ్రియా వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా సీఐఆర్‌పీలో భాగమైన వివిధ వర్గాల విధుల నిర్వహణలో సవాళ్లు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల పరిష్కారమయ్యే కేసుల సంఖ్య తగ్గింన్నారు. గత ఆర్థిక సంవత్సరం కొత్త కేసులపై విచారణ పూర్తిగా నిలిపివేయడంతో.. పరిష్కార ప్రక్రియ నెమ్మదించిందని వివరించారు. 

ఐబీసీతో సానుకూల ప్రయోజనాలే.. 
నివేదిక ప్రకారం 2016 డిసెంబర్‌ నుంచి 4,376 సీఐఆర్‌పీలను విచారణకు స్వీకరించగా.. 2021 మార్చి ఆఖరు నాటికి 2,653 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. అయితే, జాప్యం ఉన్నప్పటికీ .. ఐబీసీ వల్ల సానుకూల ప్రయోజనాలే కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ‘నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) విచారణకు స్వీకరించిన కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు అప్పీలుకు వెళ్లినప్పుడు సెటిల్‌ చేయడమో లేదా ఉపసంహరించుకోవడమో జరిగింది.

ఐబీసీ కింద చర్యలు ఎదుర్కోవడం ఇష్టం లేక కనీసం కొంత మంది ప్రమోటర్లయినా బాకీలు చెల్లించడానికి ముందుకు వస్తున్నారనడానికి ఇది నిదర్శనం‘ అని పేర్కొంది. పరిష్కారమైన కేసుల విషయంలో రుణ దాతలకు.. క్లెయిమ్‌ చేసిన మొత్తంలో సగటున 39 శాతం దాకా చేతికొచ్చింది. రాబోయే రోజుల్లో పరిష్కార ప్రణాళికకు పట్టే సమయాన్ని మరింతగా తగ్గించడం, వేలం వేసే అసెట్స్‌పై మార్కెట్‌ వర్గాల్లో ఆసక్తిని పెంచడం వంటి అంశాలు ప్రస్తుత పరిస్థితుల్లో సవాళ్లుగా ఉండనున్నాయని నివేదిక పేర్కొంది. 

చదవండి: ఆన్‌లైన్‌లో లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్, ధర

మరిన్ని వార్తలు